గురుకులాల్లో డేంజర్ బెల్స్..పది రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి
ప్రభుత్వ విద్య పర్యవేక్షణ లోపంతో ప్రమాదంలో పడిపోయింది. విద్యార్థుల ప్రాణాలను తీస్తు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
దిశ బ్యూరో,కరీంనగర్:ప్రభుత్వ విద్య పర్యవేక్షణ లోపంతో ప్రమాదంలో పడిపోయింది. విద్యార్థుల ప్రాణాలను తీస్తు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత ప్రభుత్వం కేజీ టూ పీజీ ఫ్రీ విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలు విద్యార్థుల పాలిట గుదిబండలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతో పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పది రోజుల్లో ఒకే పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం గురుకులాల పరిస్థితికి అద్దం పడుతోంది. బాబోయ్ ఈ గురుకులంలో మేము ఉండలేం అంటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను మూటాముల్లె సర్దుకుని తమ ఇండ్లకు తీసుకెళ్తున్నారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అనిరుద్ అనే ఆరో తరగతి విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూర్‌కు చెందిన మోక్షిత్, మల్యాల మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన హేమంత్ అనే మరో విద్యార్థి సైతం అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పది రోజుల కింద ఇదే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పాముకాటుకు గురై మరణించగా మరో ఇద్దరు విద్యార్థులు సైతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొన్నది. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించి విషయం అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మరణించిన బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. పది రోజుల వ్యవధిలో ఒకే స్కూల్ విద్యార్థులు ఇద్దరు మృతి చెందడంపై గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాముకాటుతోనే విద్యార్థులు మృతి చెందినట్లుగా ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురుకుల పాఠశాలను సందర్శించి ఘటన సంబంధించిన విషయాలను స్కూల్ యాజమాన్యం మరియు అధికారులతో మాట్లాడారు. పాఠశాలలోని సమస్యలను తక్షణమే పరిష్కరించి సమస్యలకు గల కారణమేవరో వారిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్‌ను ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాఠశాలలో పరిస్థితి ఇలా నెలకొన్నదని మండిపడ్డారు.
పాఠశాలలో పాము ప్రత్యక్షం..
స్థానిక అడిషనల్ కలెక్టర్ తన బృందంతో పర్యటిస్తూ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్న క్రమంలోనే మరోవైపు గురుకుల పాఠశాల కిచెన్ (కాంటీన్)వైపు ఓ పాము ప్రత్యక్షమవడం పలువురిని భయభ్రాంతులకు గురిచేసింది. వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపించాలని ఆదేశించారు. అధికారుల సమక్షంలోనే పాము ప్రత్యక్షమవడం పై విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు భయాందోళనకు గురవుతున్నారు. అదే గురుకుల పాఠశాలలో పాము ప్రత్యక్షం అవడంతో విద్యార్థుల మరణాల మిస్టరీ వీడిందని, ప్రమాదాలకు కారణాలు పాముకాటుతోనే అయ్యూంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.