Collector Sandeep Kumar Jha : ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
జిల్లాలోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని,
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు, ఎయిడ్స్, టీబీ, కుష్టు తదితర కేసులపై క్షుణ్ణంగా చర్చించారు. జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో, వారికి ఎలాంటి వైద్య సేవలు, మందులు అందిస్తున్నారో ఆరా తీశారు. ఎయిడ్స్, టీబీ, కుష్టు నిర్ధారణకు కావాల్సిన కిట్లు, మందుల పై ఆరా తీశారు. జిల్లాలో మొత్తం టీబీ కేసులు 831, ఎయిడ్స్ కేసులు 550, కుష్టు కేసులు 14 ఉన్నాయని కలెక్టర్ దృష్టికి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వసంతరావు తీసుకెళ్లారు.
కేసులు ఎక్కడ నమోదు అవుతున్నాయో, కారణాలు ఏమిటి, నియంత్రణకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సమీక్ష నిర్వహించి, పురోగతి తెలుసుకోవాలని జిల్లా వైద్య అధికారిని కలెక్టర్ ( Collector ) ఆదేశించారు. సాంస్కృతిక కళాకారులతో విద్యాలయాలు, రద్దీ ప్రాంతాలు, జాతర ప్రదేశాల్లో ఎయిడ్స్, టీబీ, కుష్టు వ్యాప్తి, డ్రగ్స్ వాడడంతో కలిగే ఇబ్బందులు, వ్యాధులు రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ దవాఖాన, ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో నిర్థారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారి వసంత రావు, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓలు రాజగోపాల్, రజిత తదితరులు పాల్గొన్నారు.