జమ్మికుంటలో రెవిన్యూ అధికారి చేతివాటం.. ఒకే ఇంటి స్థలంపై ఇద్దరికీ పట్టాలు
జమ్మికుంటలో ఒకే ఇంటి స్థలంపై ఇద్దరికీ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు.
దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని అండదండలతో అవినీతి గుండాయిజం రాజ్యమేలుతోంది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ప్రభుత్వ భూమి మారుతీ నగర్ అయ్యప్ప టెంపుల్ గుడి వద్ద కొంతమంది లబ్ధిదారులకు సర్వేనెంబర్ 887 లో నివేశన ద్రృవీకరణ పత్రం (Position certificate) పట్టాలు 2011 సంవత్సరంలో దాదాపు 630 పైచిలుకు పంపిణీ చేశారు. అందులో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన మునిగల రాధమ్మకు అట్టి స్థలంలో 60 గజాల పొసిషన్ సర్టిఫికెట్ ఇచ్చినారు ఫైల్ నెంబర్ B/947/2021 ద్వారా మోక మీద ఉన్న హద్దులతో చూపించడం జరిగింది. మొన్నటికి మొన్న భూకబ్జాదారులు అందులో అక్రమంగా కందకాలు తవ్వుతుండగా విషయం తెలుసుకొని మునిగళ్ళ రాధమ్మ ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తులను పిలిపించి తమ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అడిగితే వారు సృష్టించిన నకిలీ ధృవపత్రం B/3072/2008 ఫ్లాట్ నెంబరు 318 పేజీ నెంబర్ 123 గలది తూర్పాటి రజిత భర్త సమ్మయ్య గారి పేరు మీద ఉన్నదని ఇచ్చినారు. దీనిని స్థానిక పోలీసులు రెవెన్యూ రికార్డులలో ఎంక్వయిరీ చేయగా ఇది నకిలీ ధ్రువపత్రం అని తేలింది.
దీంతో ఫోర్జరీ కింద కేసు అవుతుందని స్థానిక గిర్దావర్ ను ఆశ్రయించి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని తమ పేరు మీద పట్టా చేయాలని కోరారు. ఈ క్రమంలోనే గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పని చేసిన రాజారెడ్డి వద్దకు వెళ్లి తూర్పాటి జంపయ్య తండ్రి నరసింహులు పేరు మీద పట్టా కాగితాలు సృష్టించారు. అనంతరం ఆ పట్టా పేపర్లను చేతపట్టుకుని గూండాల సాయంతో రాత్రికి రాత్రే ఆ స్థలంలో ఇల్లు కడుతున్నారు. ఇదే విషయమై గిర్దావర్ ను నిలదీయగా.. డబ్బులిస్తే తమకు కూడా ఒరిజినల్ పత్రం ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే వాళ్లు కూడా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగిని సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.