ఏజెంట్ ఆగడాలతో నిండు ప్రాణం బలి
విదేశాలకు పంపిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన ఏజెంట్ ఆగడాలతో నిండు ప్రాణం బలైన ఘటనలో తంగళ్లపల్లి మండలం సారంపల్లి వాసి పేరు వెలుగులోకి రావడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, తంగళ్లపల్లి : విదేశాలకు పంపిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన ఏజెంట్ ఆగడాలతో నిండు ప్రాణం బలైన ఘటనలో తంగళ్లపల్లి మండలం సారంపల్లి వాసి పేరు వెలుగులోకి రావడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హుస్నాబాద్ లో చోటుచేసుకున్న విషాద ఘటనకు బాధ్యుడుగా సారంపల్లి వాసి ఉన్నట్లు సమాచారం. మృతుడు రాసిన సూసైడ్ నోట్ లో మండలంలోని సారంపల్లికి చెందిన మహ్మద్ మహబూబ్ పేరు రాసి ఆత్మహత్య చేసుకోవడంతో అందరి దృష్టి తంగళ్లపల్లి మండలం సారంపల్లి పై పడింది. రూ. 4 లక్షలు అప్పు చేసి మరీ మహబూబ్ కు ఇచ్చినా తనను విదేశాలకు పంపించకుండా మోసం చేశాడని సూసైడ్ నోట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. తన చావుకు కారణమైన వారిని విడిచి పెట్టవద్దని వేడుకున్నాడు.
హుస్నాబాద్ ఘటనకు తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన మహ్మద్ మహబూబ్ కారణమని తెలిసి మండలంలో తీవ్రచర్చకు దారితీసింది. నకిలీ ఏజెంట్ల మోసానికి బలైన వారి ఘటనలు జిల్లాలో వరకు చోట చేసుకోవడం కలవరపెడుతోంది. గతంలో ఇలాంటి మోసగాళ్ల పై పోలీసులు కేసులు నమోదు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ సైతం ప్రజలను అప్రమత్తం చేసిన సందర్భాలున్నాయి. నకిలీ ఏజెంట్ల డబ్బుల కోసం అమాయకులకు వీసా ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం, లక్షల్లో డబ్బులు వసూలు చేయడం, మోసపోయిన బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ అధికారులు స్పందించి నకిలీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.