ట్రాక్టర్ బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగలు..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన ఇట్టేడి గంగా రెడ్డి, గడ్డం జలందర్ రెడ్డి అనే రైతులకు చెందిన ట్రాక్టర్ బ్యాటరీలను మంగళవారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు.
దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన ఇట్టేడి గంగా రెడ్డి, గడ్డం జలందర్ రెడ్డి అనే రైతులకు చెందిన ట్రాక్టర్ బ్యాటరీలను మంగళవారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. పొలం పనులు ముగించుకొని రైతులు ట్రాక్టర్లను తాండ్రియాల ఎక్స్ రోడ్డులో గల ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో నిలిపి ఉంచగా ఈ ఘటన జరిగింది. కాగా చోరికి గురైన ఒక్కో బ్యాటరీల ఖరీదు 12,000 రూపాయల వరకు ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అసలే నాట్లు వేసే సమయం కావడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అయితే ఇటువంటి ఘటనలు ఇప్పటి వరకు మూడు సార్లు వరుసగా జరగగా ఎస్సై నవీన్ కుమార్ గత ఖరీఫ్ సీజన్ లో ఆ దొంగలను పట్టుకున్నారు. అలాగే రబీ సీజన్ లో కూడా మళ్ళీ అదే పునరావృతం కావడంతో రైతులు బేంబేలెత్తుతున్నారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ట్రాక్టర్ యాజమానులు, రైతులు కోరుతున్నారు.
తొందరలో బ్యాటరీల చోరికి యత్నించిన వారిని పట్టుకుంటాం ఎస్సై నవీన్ కుమార్..
గతంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడిన వారిని పట్టుకొని కేసులు బుక్ చేశామని అలాగే ఇపుడు కూడా తొందరలోనే వారి ఆట కట్టిస్తామని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.