రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ నుంచి

Update: 2024-12-31 06:27 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మంగళవారం ఉదయం ముస్తాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను బోల్తా కొట్టించాడు. ఇసుక ట్రాక్టర్ వెనకాల కూర్చున్న హోంగార్డు వెంకట్ కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.

తీరు మార్చుకోని ఇసుక మాఫియా..?

సిరిసిల్లలో రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వచ్చిన అధికారులు, పోలీసుల పై దాడులకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ముస్తాబాద్ మండలంలోని ఓ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను చెరువులోకి దింపడం తో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా వేములవాడ నువ్వు మైనింగ్ అధికారిపై ఓ డాక్టర్ యజమాని వాగ్వాదానికి దిగుతూ దాడికి కూడా పాల్పడ్డాడు. జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ మార్గదర్శనంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి పోలీసులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపిస్తున్నారు. అయినా ఇసుక మాఫియా తీరు మార్చుకోక పోగా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది జరిగితే వారి కుటుంబాలకు ఎవ్వరూ దిక్కని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారు అభిప్రాయపడుతున్నారు.


Similar News