Collector Koya Shri Harsha : ఆగస్టు 9 లోపు రోడ్ల పై గుంతలను పూడ్చి వేయాలి
గోదావరిఖనిలోని నగరంలో రోడ్లపై ఉన్న గుంతలను ఆగస్టు 9లోపు పూడ్చి వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
దిశ, గోదావరిఖని : గోదావరిఖనిలోని నగరంలో రోడ్లపై ఉన్న గుంతలను ఆగస్టు 9లోపు పూడ్చి వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం నగరంలో పర్యటిస్తూ రోడ్ల పై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. రామగుండం నగరంలోని చల్లపల్లి రోడ్డు బస్టాండ్ కళ్యాణ్ నగర్ తదితర ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రోడ్లపై ఉన్న గుంతలను వెట్ మిక్స్, డస్ట్ తో పూడ్చి వేయాలని, ఆగస్టు 9 నాటికి నగరంలో ఎక్కడా రోడ్ల పై గుంతలు పూడ్చకుండా ఉండొద్దని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం కింద రెండవ రోజు నిర్దేశించుకున్న
నీటి వనరుల పరిశుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. నగరంలోని నీటి ట్యాంకర్లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, ప్రతి రోజూ తాగునీటి సరఫరా క్లోరినేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు. తాగు నీటి సరఫరా నాణ్యత పరీక్షలు రెట్టింపు చేయాలని, నేటి సరఫరా సోర్స్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్లలో నాణ్యత పరీక్షలు నిర్వహించాలని , నగరంలోని బస్తీలు, ఎస్సీ, ఎస్టీ కాలనీలను పర్యటించి తాగునీటి సరఫరా స్థితిగతులను తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. నగరంలో ౩౦౦
చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో ఉన్న భవనాలను గుర్తించి వాటికి తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని చెరువులు, కుంటలను సంరక్షించి వాటి పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. అనంతరం నగరంలోని గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన గ్రంథాలయ భవనం నిర్మాణం చేయడానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.