ఢిల్లీ కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం

దేశంలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిన నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-01-04 12:44 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : దేశంలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిన నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి దాంట్లో కోతలు పెట్టి వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ కు పంపుతున్నారని ఆరోపించారు.

    సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని కట్టింగ్ మాస్టర్ అంటూ సెటైర్ వేశారు. అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటిందని, వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలు ఆరు నెలలైనా అర గ్యారంటీ కూడా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. 100% రుణమాఫీపై ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ ఒక్కొక్క తీరు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడానికైనా ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాక ప్రశ్నించే వారిపై రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని, కేసులు పెడితే పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని, చిట్టి నాయుడు ఏమి చేయలేడని భరోసా ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక తనపై ఆరు కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారని, పార్టీ తరఫున హైకోర్టుతో పాటు అన్ని జిల్లాల్లో లీగల్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మేడిగడ్డను కాంగ్రెసోల్లే ఏదో చేసిండ్రు

మేడిగడ్డ కుంగడానికి కాంగ్రెసోల్లే కారణమేమోనని, వాళ్లే దాన్ని ఏమో చేసి ఉంటారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కట్టిన ఎన్నో ప్రాజెక్టులు బలంగా ఉన్నాయని, మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లరు కుంగడానికి ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే కారణమై ఉంటారన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించినా, ఇటీవల ఆ ప్రాంతలో అతి పెద్ద భూకంపం సంభవించినా మేడిగడ్డకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. ఏదిఏమైనా కుంగిన మేడిగడ్డను రిపేరు చేయడానికి రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతుందని నిపుణులు చెప్తున్నారని, మేడిగడ్డను ఎందుకు ప్రభుత్వం రిపేరు చేయించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

    మేడిగడ్డ ప్రాజెక్టును రిపేరు చేస్తే దానివల్ల పండే కోటి 20 లక్షల మేట్రిక్ టన్నుల పంటను కొనుకోలు చేసి, రైతులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, అందుకే దానిని రిపేర్ చేయడం లేదన్నారు. పైన ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెసోళ్లు అవులేగాళ్ల లెక్కున్నారని, అసెంబ్లీలో తనను ఇబ్బంది పెడుతున్న వాళ్ల పేర్లు తాను రాసి పెట్టుకుంటున్నానని, ఇక్కడ మిమ్మల్ని సతాయిస్తున్న  వాళ్ల పేర్లు రాసి పెట్టుకోవాలని, టైం వచ్చినప్పుడు మిత్తితో సహా తీర్చుకుందామని సూచించారు. మూలిగే ముసలి నక్క లాంటి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని, మళ్లీ తమకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో ఉండాలనుకునే అభ్యర్థులు ప్రేక్షక పాత్ర పోషించకుండా, రేవంత్ సర్కార్ చేస్తున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బరిలో నిలిచి గెలవాలనుకున్న అభ్యర్థులు ఇంట్లో పడుకోకుండా కాలికి బలపం కట్టుకొని తిరిగినట్లు తిరగాలన్నారు. నూతన కమిటీలు వేయాలని తనను కొంతమంది కోరారని, బూత్ స్థాయిని మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు అతి త్వరలోనే నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేమా అంటున్న జనం...

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా చెయ్యవచ్చా అని కొందరు తనని అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇటీవల తనను ఎన్నారై దంపతులు కలిశారని, అందులో ఓ మహిళ మాట్లాడుతూ అన్నా తెలంగాణ రాష్ట్రం పిచ్చోని చేతిలో రాయిలా మారిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేమా అన్నా అంటూ పదేపదే అడిగిందన్నారు.

    దానికి ఆయన ఒక్కసారి ఓటు వేస్తే ఐదేండ్లు శిక్ష తప్పదని సమాధానం చెప్పినట్లు తెలిపారు. అయితే గతంలో సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఓ సమావేశంలో కేటీఆర్ తాను హైదారాబాద్ లో ప్రయాణించే క్రమంలో సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు ఓ ఆటో డ్రైవర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేమా అని అడిగినట్లు ప్రస్తావించారు. అప్పుడు కూడా తాను ఇలాగే సమాధానం చెప్పినట్లు వివరించారు.  


Similar News