సర్వే గుబులు.. అప్రమత్తమైన అధిష్టానం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలపై అధికార పార్టీ చేయించిన సర్వే నివేదిక అధికార పార్టీ కంగుతినే విధంగా వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సర్వేతో అప్రమత్తమైన
దిశ, కరీంనగర్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలపై అధికార పార్టీ చేయించిన సర్వే నివేదిక అధికార పార్టీ కంగుతినే విధంగా వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సర్వేతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఇటీవల భేటి అయ్యారు. టికెట్లు వస్తుందో రాదో అని అందోళన చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ భేటి కావడం హాట్ టాపిక్‌గా మారగా చర్చ మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేయించిన సర్వే మీదనే జరిగినట్లు తెలిసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఎల్. రమణ సైతం భేటిలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటి కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటిలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల నియోజకవర్గాల వారీగా చేపట్టిన సర్వే నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఐదు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టు వచ్చినట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక మంథని నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 11 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుత సర్వే నివేదికల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సత్తా చాటాలంటే కనీసం ఇప్పటి నుంచి అయిన కష్టపడి పని చేయాలని కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
ఊగిసలాటలో ఆశావహులు..
మంత్రి కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో భేటి కావడంతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో తమకు టికెట్ వస్తుందని భావించిన ఆశావహులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కేటీఆర్ సిట్టింగులతో సమావేశం ఏర్పాటు చేయడంతో ఆశావహుల విషయం చర్చకు వచ్చిందా?.. వస్తే ఏమీ చర్చ జరిగింది?.. అనేది బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలైయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో భేటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.