దిశ బ్యూరో, కరీంనగర్ : ఇక్కడ ధాన్యం ఉండదు.. షిప్ట్ంగ్ జరగదు.. దందా అంత పేపర్లపైనే జరుగుతుంది. ప్రభుత్వ డిఫాల్టర్ లిస్టులోనుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా సాగుతున్న అక్రమ దందా! ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సాగాల్సిన ధాన్యం తరలింపు వ్యవహారం అధికారులు లేకుండానే మిల్లర్లు పేపర్లపైనే మ్యాజిక్ చేస్తూ తరలిస్తున్నారు. దీంతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కోట్టేసిన మిల్లర్లు అధికారులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని చీట్ చేస్తున్నారు. అధికారులు డిపాల్ట్ మిల్లుల దరిదాపుల్లోకి వెళ్లకుండానే ప్రభుత్వ రికార్డుల్లో ధాన్యం షిప్టింగ్ జరిగినట్టు ధ్రువీకరిస్తూ మిల్లర్ల దందాకు అండగా నిలుస్తున్నారు. కళ్ల ముందే అక్రమ దందాకు బేరం సాగుతున్నా కట్టడి చేయాల్సిన అధికారులు మిల్లర్లు ఇచ్చే మామూళ్ల మత్తులో మిన్నకుంటున్నారు. రూ.కోట్లు కొట్టేస్తున్న మిల్లర్లు తమ దందాకు సహకరించిన అధికారులకు నజరానాగా రూ.లక్షలు చెల్లిస్తూ షిఫ్టింగ్ చీటింగ్ దందా సాగిస్తున్నారు.
రైతుల ధాన్యం ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు రూపాయి పెట్టుబడిలేకుండా దర్జాగా కొట్లు కొల్లగోడుతున్నారు. ఏళ్ల తరబడి గత పాలకుల కనుసన్నల్లో సాగిన దందా ప్రభుత్వం మారినా అడ్డుకట్ట పడడం లేదు. రూ.కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన మిల్లర్లు సంవత్సరాల తరబడి పేపర్లపైనే మ్యాజిక్ చేస్తూ మాయాజాలం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అక్రమ దందాకు అడ్డు తొలగించుకుంటున్నారు. మరోమారు తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్లు ప్రభుత్వాన్ని చీట్ చేస్తూ షిప్టింగ్ చీటింగ్ దందా సాగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
సీఎంఆర్ పెండింగ్‌తోనే..
ప్రభుత్వం రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. అందుకు మిల్లర్లకు ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్న ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్ ఫోర్టు చార్జీలతోపాటు షిప్టింగ్ కోసం కూడా డబ్బు చెల్లిస్తుంది. అయితే మర ఆడించి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిన మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ప్రైవేటుగా మార్కేట్‌లో అమ్ముకుని ఆ సొమ్ముతో వ్యాపారాలు సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఆ డబ్బుతో అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వానికి మస్కా కొడుతున్నారు. అందుకు పేదలకు అందాల్సిన బియ్యాన్ని నేరుగా డీలర్లనుంచి కొనుగోలు చేసి వాటిని రిసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ ఈ దందాను ఏళ్ల తరబడిగా సాగించారు. అయితే ప్రభుత్వం మారడంతో మిల్లర్లపై దృష్టి సారించిన ప్రభుత్వం శాఖాపరంగా ఒత్తిడి పెంచి కట్టడిచేసే దిశగా ప్రయత్నం సాగించడంతో మిల్లర్లు అధికారులను అడ్డు పెట్టుకుని షిఫ్టింగ్ చీటింగ్ దందాకు రంగం సిద్ధం చేసుకున్నారు.
దందాకు రంగం సిద్ధం..
సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల జాబితాను సేకరించిన ప్రభుత్వం సీఎంఆర్ అప్పగించేందుకు గడువు పెంచి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ మిల్లర్ల వద్ద ధాన్యం లేకపోవడంతో ప్రభుత్వానికి కుంటి సాకులు చెప్పి ధాన్యం అప్పగిస్తాం అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. అయితే మిల్లర్లు డిపాల్టర్ లిస్టునుంచి తొలగించేందుకు పక్కాప్లాన్‌తో అధికారులను అడ్డుపెట్టుకుని ధాన్యం షిప్టింగ్‌కు ఓప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందుకు అప్పగించే మిల్లర్లతో బేరం కుదుర్చుకున్న డిపాల్టర్ మిల్లర్లు 1740 క్వింటాళ్ల ధాన్యానికి రూ.1.50లక్షల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. మిల్లర్ల వద్ద ధాన్యం లేకపోయినా పేపర్లలో ధాన్యం షిప్టింగ్ చేసినట్టు ప్రభుత్వానికి నివేదికలు పంపి మస్కా కొడుతున్నారు. అయితే ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ అడ్డు లేకుండా షిఫ్టింగ్ చీటింగా దందా యథేచ్ఛగా సాగుతోంది.
అధికారుల పర్యవేక్షణ లోపమే..
ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపిస్తున్న తరుణంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో మిల్లరు రికార్డు గతంలో ఎలా ఉంది, సీఎంఆర్ పెండింగ్ ఉందా? అనే విషయాలు పరిగణలోకి తీసుకుని పంపాల్సి ఉంది. కాగా, అలా ఎక్కడ జరగడం లేదు. డిపాల్టర్ మిల్లర్లకు సైతం అడ్డగోలుగా ధాన్యం కెటాయిస్తున్నారు. దీంతో మిల్లర్లు ధాన్యాన్ని ప్రైవేటుగా అమ్ముకుని వచ్చిన లాభంతో అధికారులను మచ్చిక చేసుకుని మామూళ్ల రూపంలో అప్పగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మిల్లర్లు సంవత్సరాల తరబడి ప్రభుత్వాన్ని చీట్ చేస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు.
డిపాల్టర్ లిస్టునుంచి తొలగించుకోవడమే లక్ష్యం..
మిల్లర్లు ప్రభుత్వానికి ధాన్యం అప్పగించే నెపంతో డిపాల్టర్ లిస్టునుంచి తొలగించుకోవడమే టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారు. అందుకు ఖరీఫ్ క్లియర్ ఉన్న మిల్లులకు ధాన్యాన్ని అప్పగిస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకున్న డిపాల్టర్ మిల్లర్లు ధాన్యం అప్పగించకుండా పేపర్లలో సదరు మిల్లుకు ధాన్యం షిప్ట్ చేసినట్టు చూపిస్తూ అందుకు సదరు మిల్లర్లకు 1740 క్వింటాళ్ల ధాన్యానికి రూ.1.50లక్షలు నజరానాగా చెల్లిస్తూ ప్రభుత్వాన్ని చీటింగ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. షిఫ్టింగ్ ప్రక్రియ అధికారుల కనుసన్నల్లో జరగాల్సి ఉండగా అధికారులు లేకుండానే షిప్టింగ్ జరిగినట్లు దృవీకరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఏళ్ల తరబడి మిల్లర్లు ప్రభుత్వాన్ని చీట్ చేస్తునే ఉన్నారు. ఈ చీటింగ్ దందాకు బ్రేక్ పడే అవకాశం ఉందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.