సుల్తానాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
సుల్తానాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారును ఆదేశించారు.
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారును ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి మున్సిపాలిటీ పని తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్లను శుభ్రంగా ఉంచాలని, చెత్తా, చెదారం, ప్లాస్టిక్ లేకుండా చూడాలని ఆదేశించారు. పట్టణంలో ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలని, పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావాలని కోరారు. మున్సిపాలిటీలో పన్నుల వసూలు అసెస్మెంట్ సమీక్షించుకొని 100 శాతం వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సుల్తానాబాద్ పట్టణ ప్రాంత పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ 97 శాతం పూర్తయిందని, పెండింగ్ సర్వే వెంటనే పూర్తి చేయాలని కోరారు. పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైయిన్ల నిర్మాణం, జంక్షన్ అభివృద్ధి వంటి పనులు మార్చి 2025 లోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించి నిర్మాణంలో ఉన్న తరగతి గదులను త్వరగా పూర్తిచేయాలని, అనంతరం పిల్లలను తరగతి గదులకు తరలించాలని కోరారు. అక్కడి నుంచి వెళ్లి నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం కాట్నపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రజా పాలనలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి యాప్ లో నమోదు చేయాలని కోరారు. అలాగే గ్రామపంచాయతీలో ఎంపీడీఓలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల సూపర్ చెక్ ఆఫ్ పని తీరు పరిశీలించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.