బీసీ బంధులో పెద్ద ఎత్తున అక్రమాలు.. కాసులు చెల్లించినోళ్లకే సం‘క్షేమం’..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన బీసీ బంధు పథకం దళారుల జేబులు నింపింది.

Update: 2025-01-06 02:45 GMT

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన బీసీ బంధు పథకం దళారుల జేబులు నింపింది. కాసులు చెల్లించినోళ్లకే సం‘క్షేమం’ అందడంతో అర్హులైన లబ్ధిదారుల ఆశలు నీరుగారాయి. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 159 మందికి పలు రకాల యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత తన అనుయాయులకు భారీగా బీసీ కార్పొరేషన్ యూనిట్లు మంజూరు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల ప్రమేయం లేకుండానే గ్రామాల్లో అప్పటి అధికార పార్టీ నేతల చుట్టూ మోకరిల్లిన వారికి ఈ యూనిట్లు మంజూరు చేయించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష చొప్పున మంజూరైంది. లబ్ధిదారులు యూనిట్ ఏర్పాటు చేశారా ? చేయలేదా ? అని విచారణ కూడా చేయలేదని తెలుస్తోంది. అధికారుల పై ఒత్తిడి తెచ్చి యూనిట్లు గ్రౌండింగ్ చేయించినట్లు విమర్శలున్నాయి. తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో బీసీ కార్పొరేషన్ యూనిట్ల పై అధికారులు విచారణ జరుపుతున్నారు. యూనిట్లు ఏర్పాటు చేయకుండా నేరుగా నిధులు సొంతానికి వాడుకున్న వారు ఎంత మంది ఉన్నరో లెక్క తేల్చనున్నారు. అక్రమాలకు పాల్పడిన వారి పై ప్రభుత్వ సూచనల మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

దిశ, ఎల్లారెడ్దిపేట : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంధు (బీసీ కార్పొరేషన్) పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా బీసీ సంక్షేమధికారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్దిపేట మండలానికి మంజూరైన యూనిట్ల పై క్షేత్ర స్థాయిలో అధికారులు విచారణ జరుపుతున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆగడాలు లెక్కకు మించి ఉన్నాయి. మండలంలోని అన్ని బీసీ సామాజిక వర్గాల వారికి పలురకాల యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. పేరుకే ప్రభుత్వం గెజిట్ జారీ చేసినా స్థానిక లోకల్ బీఆర్ఎస్ నాయకులు అధికారుల ప్రమేయం లేకుండానే గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల చుట్టూ మోకరిల్లిన వారికి యూనిట్లు మంజూరు చేయించినట్లు విమర్శలున్నాయి. అప్పటి బీసీ జిల్లా అధికారుల పై అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత బీసీ కార్పొరేషన్ తన అనుయాయులకు భారీగా బీసీ కార్పొరేషన్ యూనిట్లు మంజూరు చేయడంలో చక్రం తిప్పినట్లు బహిరంగా ఆరోపణలు ఉన్నాయి.

గ్రామాల వారీగా మంజూరైన యూనిట్లు..

అక్కపల్లి -2, ఆల్మస్ పూర్-13, బండలింగంపల్లి -7, బొప్పపూర్ -20, దుమాల-8, గొల్లపల్లి-26, గుండారం-1, కోరుట్లపేట -4, నారాయణపూర్ -8, పదిర-19, పోతిరెడిపల్లి-3, రాజన్న పేట -6, సింగారం -5, తిమ్మాపూర్-6, వెంకటాపూర్ -6, ఎల్లారెడ్దిపేట- 25 చొప్పున యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి.

యూనిట్లు లేవు.. డబ్బులు డ్రా ?

మండలంలో సుమారు 159 మందికి బీసీ కార్పొరేషన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కొ లబ్ధిదారుడికి లక్ష రూపాయల చొప్పున మంజూరయ్యాయి. అప్పటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు యూనిట్ ఏర్పాటు చేశారా ? చేయలేదా ? అని విచారణ చేయకుండానే బీసీ సంక్షేమధికారితో పాటు అప్పటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పై కూడా ఒత్తిడి తెచ్చి యూనిట్లు గ్రౌండింగ్ చేయించారు. విచారణ ఎలాంటి జరుపకుండానే యూనిట్ కు లక్ష రూపాయలు ఆయా గ్రామాల్లో వార్డు మెంబర్ స్థాయి నుండి ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులు సైతం అటు మంత్రి కేటీఆర్, ఇటు జిల్లాకు చెందిన కీలక బిఆర్ఏస్ నాయకులు చక్రం తిప్పి ఏర్పాటు చేయని యూనిట్లకు రుణాలు గ్రౌండింగ్ చేసి లక్షల రూపాయలు కొల్ల గొట్టారని ఆరోపణలు ఉన్నాయి.

కమీషన్ల దందా ?

ఎల్లారెడ్దిపేట మండలంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు వార్డు, ఎంపీటీసీ, సర్పంచ్ లు యూనిట్ కు రూ. లక్ష చొప్పున అప్పటి ప్రభుత్వం మంజూరు చేయగా అప్పటి ప్రజాప్రతినిధులు పది శాతం నుండి ఇరవై శాతం వరకు కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.


Similar News