వేగంగా రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు
జిల్లాలోని రాఘవాపూర్- కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
దిశ,పెద్దపల్లి : జిల్లాలోని రాఘవాపూర్- కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్- కన్నాల రైల్వే ట్రాక్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్న పునరుద్దరణ పనులను పరిశీలించారు. మంగళవారం రాత్రి ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బుధవారం తెల్లారుజామున వరకు ఉండి పోలీసు సిబ్బంది తో కలిసి అవసరమైన చర్యలు చేపట్టారు.
సింగరేణి సంస్థతో మాట్లాడి ఘటనా స్థలానికి వెంటనే భారీ క్రేన్లు తీసుకుని వచ్చి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును క్లియర్ చేసే పనులు ప్రారంభించారు. బుధవారం ఉదయం మళ్లీ ఘటన స్థలానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను ట్రాక్ పై ట్రాలీ పై వెళ్లి పరిశీలించి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రైల్వే జీఎంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.