అమానుషం..కొడుకు డబ్బుల కోసం అమ్మ ను కిడ్నాప్

కొడుకుకు సంబంధించిన వృత్తి పరమైన వ్యవహారంలో

Update: 2024-11-07 08:37 GMT

దిశ, వేములవాడ : కొడుకుకు సంబంధించిన వృత్తి పరమైన వ్యవహారంలో జరిగిన వివాదం మానవత్వం మరిచేలా చేసింది. కొడుకు ఇచ్చే డబ్బుల విషయంలో అమ్మను కిడ్నాప్ చేసిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీను అనే వ్యక్తి బండ పని మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన లాలు దేవకర్ అండ్ టీం కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనులను కాంట్రాక్టు తీసుకున్నారు. ఇందుకోసం కూలీలు అవసరం ఉండగా కొడుముంజ కు చెందిన పల్లపు శ్రీను, అతని సోదరుడిని సంప్రదించారు. ప్రస్తుతం శ్రీను, అతని సోదరుడు ఛత్తీస్ ఘడ్ లో కూలీ పనులు చేస్తున్నారు. అయితే లాలు దేవకర్ కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన కూలీలను పురమాయించేందుకు ఛత్తీస్ ఘడ్ కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు.

దీనికి మధ్య వర్తిత్వంగా శ్రీను బాధ్యత తీసుకున్నాడు. ఇందుకోసం లాలు దేవకర్ రూ. 3.80 లక్షలను కూలీలకు చెల్లించాడు. అయితే కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవకర్ కు, కొడుముంజ కు చెందిన శ్రీను, అతని సోదరునికి మధ్య వివాదం చోటు చేసుకుంది. తన డబ్బులు ఇవ్వాలని లాలు దేవకర్ శ్రీను అతని సోదరుడిపై ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం లాలు దేవకర్, మరికొంత మంది కొడుముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని శ్రీను ఇంటికి వచ్చారు. శ్రీను అతని సోదరుడు ఇంటి వద్ద లేకపోవడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో వాగ్వివాదానికి దిగారు. ఇంట్లో ఉన్న శ్రీను తల్లి అయిన పల్లపు భీమా బాయ్ ని బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ కు పాల్పడ్డారు.

డబ్బులు ఇచ్చి తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న భీమా బాయ్ ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లాలు దేవకర్ అతని అనుచరులు దౌర్జన్యంగా భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీర ప్రసాద్ కేసు నమోదు చేసి స్పెషల్ టీంను రంగంలోకి దించారు. పల్లపు భీమా బాయ్ ను ఎత్తుకెళ్లిన వారు మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.


Similar News