కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఎదుట స్వల్ప ఉద్రిక్తత

Update: 2023-05-05 14:16 GMT

హనుమాన్ భక్తులతో కలిసి ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు

దిశ కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ కార్యకర్తలు, భజరంగ్ దళ్ నాయకులు, హనుమాన్ భక్తులతో కలిసి 'హనుమాన్ చాలీసా' అంటూ నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో తన ఎన్నికల మెనిఫెస్టోలో 'బజరంగ్ దళ్'ని నిషేధిస్తామంటూ ప్రకటించారు.

దీంతో హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా హనుమాన్ చాలీసా అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించారు. అదేవిధంగా, కాంగ్రెస్ వారి ప్రయత్నాన్ని విఫలం చేయాలని నిర్ణయించుకుని పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో సమావేశమైంది.

ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పసిగట్టిన పోలీసులు పెద్దఎత్తున డీసీసీ కార్యాలయం వద్దకు చేరుకుని హనుమాన్‌ భక్తులను, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి హనుమాన్‌ చాలీసా ఆలపించాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై మండిపడ్డారు. హిందూ దేవుళ్లను రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

కర్నాటక ఎన్నికల్లో ఓటమి భయంతో ఉన్న బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మతపరమైన విద్వేశాలను రెచ్చగొడుతోందిన మండిపడ్డారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలను నిర్లక్ష్యం చేసినందుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఎంపీని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు వి.అంజన్‌కుమార్‌, రెహమత్‌ హుస్సేన్‌, ఎం రోహిత్‌రావు, పి.కృష్ణారెడ్డి, పి.ఆంజనేయులు, పి.రాహుల్‌, చెర్ల పద్మ, లత, శారద, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News