బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే సింగరేణికి మనుగడ : ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే సింగరేణికి మనుగడ సాధ్యమని కోరుకంటి
దిశ, గోదావరిఖని : బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే సింగరేణికి మనుగడ సాధ్యమని కోరుకంటి చందర్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనలో కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నీలాపనిందలు వేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేయడం పట్ల ప్రజలంతా కన్నెర్ర చేయాల్సిన అవసరం ఉందని రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ అవినీతి అక్రమాల మూలంగానే, తమ అనుయాయులకు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు బ్లాకులను కేటాయించడం మూలంగానే బీజేపీ ప్రభుత్వం 2014లో ఎంఎండీఆర్ యాక్ట్ పెట్టిందని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లోపాయికారి ఒప్పందాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ అనుయాయులకు బొగ్గుబ్లాకులను కేటాయించిందని, దానికి నాటి మంత్రి దాసరి నారాయణ రావే ప్రత్యక్ష సాక్షి అన్నారు.
ఇప్పుడు సింగరేణి ప్రైవేటు పరం కావడానికి తాము కారణంగా కాదని బీజేపీ, బీఆర్ఎస్ పైనే నెపం వేస్తూ తప్పించుకో చూస్తుందని ఆరోపించారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణకు తెరలేపి, కార్మికులకు నష్టానికి కారణమైన కాంగ్రెస్, బీజీపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పక్షపాతి అని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును కారుణ్య నియామకాల పేరుతో కేసీఆర్ మళ్లీ పునరుద్ధరించారని ప్రతి ఏటా లాభాల వాటా పెంచుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే సింగరేణికి మనుగడ అని కార్మికులకు మరిన్ని హక్కులు సాధించగలమని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేసి గనుల పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య గండ్ర దామోదర్ రావు కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్, మాదాసు రామ్మూర్తి, తానిపర్తి గోపాలరావు, జిట్ట వేణి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.