బాబోయ్ దోమలు..ప్రజలను వెంటాడుతున్న సీజనల్ వ్యాధులు

హుజూరాబాద్ పట్టణంలో ఖాళీ స్థలాలు మురుగు కూపాలుగా మారుతున్నాయి. దీంతో పందులు, దోమలకు అవాసాలుగా మారి ప్రజలను కలవర పెడుతున్నాయి.

Update: 2024-08-10 02:05 GMT

దిశ,హుజూరాబాద్ రూరల్:హుజూరాబాద్ పట్టణంలో ఖాళీ స్థలాలు మురుగు కూపాలుగా మారుతున్నాయి. దీంతో పందులు, దోమలకు అవాసాలుగా మారి ప్రజలను కలవర పెడుతున్నాయి. ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలు కొన్ని యజమానులు ఖాళీగా ఉంచడంతో ఆ స్థలాల్లో వర్షాలకు నీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాక పిచ్చి మొక్కలు, కంపచెట్లు పెరిగి చెత్తాచెదారం నిండుకుంటోంది. ఆ స్థలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. అపరిశుభ్రంగా మారిన నివాస గృహాలు పక్కన ఖాళీ స్థలాలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు నిలుస్తున్న స్థలాల్లో దోమల ఉధృతి పెరుగుతోంది. ఖాళీ స్థలాల్లో నీరు చేరడంతో విష పురుగులు, దోమలు నివాసాలు ఏర్పరచుకుంటున్నారు.

దీంతో వర్షాకాలం ప్రారంభంతో నిలుచున్న, కూర్చున్నా, నిద్రిస్తున్నా దోమకాటు తప్పడం లేదు. ఎన్నడూ లేనంతగా ఈసారి దోమలు స్వైర్య విహారం చేస్తుండడం ప్రజలను కలవరపరుస్తోంది. హుజూరాబాద్ పట్టణంలో దోమల నివారణకు మున్సిపాలిటీ పరంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా ఫాగింగ్, డ్రైనేజీల్లో దోమల నివారణకు పిచికారి చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరంతోపాటు చికెన్ గున్యా, విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రజలను పీడిస్తున్నాయి.

పట్టించుకోని అధికారులు..

పట్టణంలో సమస్యగా మారిన ఖాళీ స్థలాలపై మున్సిపల్ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా 35వేల పైగా జనాభా ఉంటుంది. ప్రతి వార్డులో ఐదు నుంచి 10వరకు దాదాపు 3వేల వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి.ఈ స్థలాల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, దుర్గంధం వస్తుందని స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఖాళీ స్థలాల్లోనే చెత్తాచెదారం..

మున్సిపల్ అధికారులు ప్రతి రోజు ఇంటింటికి చెత్త సేకరణ చేపడుతున్నా పట్టణ ప్రజలు చెత్తాచెదారం, వ్యర్థాలను ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. చెత్తాచెదారం పేరుకు పోవడం చెట్లు పెరిగి భయంకరంగా కనిపిస్తున్నాయి. ఖాళీ స్థలాల్లో నీరు, చెత్తాచెదారం నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. మరోపక్క దుర్గంధం వెదజల్లుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఖాళీ స్థలాల పై సర్వే చేసి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నోటీసులు ఇస్తాం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తాం. వాటిని చదును చేసుకోవాలని తెలియజేస్తాం. బొందలుగా ఉన్న ప్లాట్లను యజమానులే చదును చేసుకోవాలి. పక్కా గృహాలు వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. నోటీసులకు స్పందించని వారి ప్లాట్లను మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటుంది. దోమల నివారణకు తగిన చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు వార్డులను తమ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.


Similar News