నాణ్యతా ప్రమాణాలను పాటించాలి

నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

Update: 2024-10-09 10:58 GMT

దిశ,పెద్దపల్లి : నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024 లో  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.పెద్దపల్లి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అన్నారు. ఎవరు ఎటువంటి ఒత్తిడి తెచ్చినా నాణ్యతలేని పంట కొనుగోలు చేయొద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జిలకు సూచించారు.  ప్రతిరోజూ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఓపీఎంఎస్ లో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు.

    ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు, గన్నీ బ్యాగులు మొదలైన సామగ్రి అందుబాటులో ఉందో లేదో అక్టోబర్ 16 నాటికి నివేదిక అందించాలని సూచించారు. మార్కెటింగ్ అధికారితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు పాటించాలని, రైతులకు ఈ సమాచారం అందించాలని అన్నారు. క్రాప్ బుకింగ్ ప్రకారం సన్న వడ్లు వేసిన రైతుల వివరాలు అందించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సన్న వడ్ల సంచులకు రెడ్ ట్యాగ్ వేయాలని అన్నారు.  అక్టోబర్ 15 నుంచి 20 వరకు ప్రతి మండలానికి ముందుగా 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, పంట దిగుబడుల ప్రకారం వాటిని పెంచాలని సూచించారు. హార్వెస్టర్లతో కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

     ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత  గన్నీ సంచులకు ట్యాగ్, సెంటర్ నెంబర్ వేయాలని అన్నారు.  కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు త్వరితగతిన తరలించాలన్నారు. రైస్ మిల్లులో ఎట్టి పరిస్థితుల్లోనూ తాలు కట్ చేయడానికి వీలు లేదని, నాణ్యతను కొనుగోలు కేంద్రాల దగ్గరే పరిశీలించి పంపాలని సూచించారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాలపై వచ్చే వ్యతిరేక వార్తలను ఎప్పటికప్పుడు  పరిశీలించి లోపాలు సవరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, డీఎం మార్కెటింగ్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఏఓలు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News