శివ కల్యాణానికి ముస్తాబు.. మహోత్సవానికి రాజన్న సన్నిధిలో ఏర్పాట్లు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం శ్రీ

Update: 2025-03-14 01:43 GMT
శివ కల్యాణానికి ముస్తాబు.. మహోత్సవానికి రాజన్న సన్నిధిలో ఏర్పాట్లు
  • whatsapp icon

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 16నుంచి 20 వరకు 5రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు ఆలయంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వాస్తవానికి ఏ శివాలయంలోనైనా శివరాత్రి రోజే శివ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శివరాత్రి తో పాటు కామదహనం, హోలీ తర్వాత ఘనంగా శివ కళ్యాణం నిర్వహించడం గత 60 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. శివమహాపురాణం, లింగ పురాణం ఆధారంగా మన్మధుడి దహనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు. ఈ క్రమంలోనే స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

17న కల్యాణం, 19న రథోత్సవం వేడుకల్లో భాగంగా 17న సోమవారం ఉదయం 10:40 నుంచి 12:55 గంటల వరకు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు భాగంలో ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక మీద శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. కల్యాణం అనంతరం 19న బుధవారం సాయంత్రం 3:05 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. 20న ఉదయం పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాంత సేవ పూజా కార్యక్రమాలను చేసి శివ కల్యాణ తంతు, ఐదు రోజుల పాటు రాజన్న సన్నిధానంలో జరిగిన శివ కళ్యాణ మహోత్సవాలు ముగింపు పలుకుతారు. ఇదిలా ఉండగా ఈ కళ్యాణ వేడుకలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

పలు రకాల పూజలు నిలుపుదల..

స్వామి వారి కళ్యాణ వేడుకల నిర్వహణ సందర్భంగా ఆలయంలో పలు రకాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్న తరుణంలో భక్తులు జరిపించుకునే నిత్య కల్యాణం, లింగార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు, అన్న పూజ సేవల టికెట్లు నిలిపివేస్తారు. 17న శివ కళ్యాణం నిత్య చండీ సహిత రుద్రహోమ టికెట్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 16న ఆదివారం రాత్రి 11:30 గంటల వరకు భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించే కోవచ్చని, సోమవారం కల్యాణం సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కోడే టికెట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


Similar News