అడ్డాలుగా సెంట్రల్ హాళ్లు, లాడ్జీలు.. పట్టించుకోని అధికార యంత్రాంగం
హుజూరాబాద్ పట్టణంలో పేకాట మూడు పేకలు.. ఆరు ఆటలుగా విరాజిల్లుతోంది.
దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలో పేకాట మూడు పేకలు.. ఆరు ఆటలుగా విరాజిల్లుతోంది. పేకాటను ప్రభుత్వం నిషేధించడంతో కొందరు నిర్వాహకులు లాడ్జీలు, సెంట్రల్ హాళ్లను అడ్డాగా ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లలో యజమానులు పేకాటను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు పేకాటకు అడ్డాలుగా మారుతున్నాయి. క్లబ్బుల తరహాలో విచ్చలవిడిగా జూదం సాగుతోంది. పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుంచి కూడా జూదరులు ఇక్కడికి వస్తుండడం గమనార్హం.
ఫంక్షన్ హాళ్లు, లాడ్జీల యజమానులు పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జమ్మికుంట రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ ఒక లాడ్జిలో పేకాటతోపాటు అసాంఘిక కార్యకలాపాలు సైతం జరుగుతున్నట్లు సమాచారం. జమ్మికుంట రోడ్డులో ఉన్న ఒక లాడ్జిలో గత కొద్ది రోజుల కింద ఒక ప్రభుత్వ ఉద్యోగి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులను మేనేజ్ చేసుకుని బయటపడినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి పోలీసులు ఈ లాడ్జిపై నిఘావేసినట్లు తెలిసింది.
అక్రమాలకు ప్రోత్సాహం..!
జమ్మికుంట రోడ్డులో ఉన్న మరో ఫంక్షన్ హాలులో సకల సౌకర్యాలు కల్పిస్తూ పేకాట, అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రూమ్స్ సైతం బుక్ చేస్తున్నట్లు తెలిసింది. ఏలాంటి అనుమతి లేకుండా ఆన్ లైన్‌లో రూములు బుక్ చేసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక గంటకు రూ.500నుంచి రూ.700 లాడ్జీల నిర్వాహకులు తీసుకుంటున్నట్లు తెలిసింది. రాత్రి సమయంలో కాకుండా పగలే ఎక్కువగా లాడ్జిల్లో, సెంట్రల్ హాళ్లలో అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి.
అదేవిధంగా పోలీసులు పట్టణ శివార్లు, గ్రామాల్లలో అక్కడక్కడ పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. కానీ పెద్దమొత్తంలో నగదు పెట్టి ఫంక్షన్ హాలులో, సెంట్రల్ హాలులో, లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు నడుస్తూ పేకాట ఆడుతున్న వారి వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పేకాట ఆడుతుండగా కొందరు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని తెలుసుకుని పేకాట రాయుళ్లు తమ స్థావరాలను లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లకు మార్చుకున్నట్లు తెలిసింది. గత రెండు రోజుల కింద పోలీసులు పట్టణంలోని లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఫంక్షన్ హాల్, సెంట్రల్ హాల్స్, లాడ్జిలకు ముందే సమాచారం అందగా జాగ్రత్త పడినట్లు తెలిసింది.
రోడ్డున పడుతున్న కుటుంబాలు...
ఒకప్పుడు పేకాటను సరదాకు ఆడేవారు. ఇప్పుడు సంపాదన కోసం ఆడే వాళ్లు ఉన్నారు. ఏదో ఉద్యోగానికో, ఉపాధికో వెళ్లినట్టు పొద్దున్నే టిక్ టాక్‌గా రెడీ అవుతూ పేకాడడానికి వెళ్తున్న బ్యాచ్‌లు పట్టణంలో ఉన్నాయి. చిన్న మొత్తాల్లో సరదా కోసం ఆడే రోజులు కూడా పోయాయి. పెద్దమొత్తాలను పెడుతూ రోజంతా ఆడుతున్నారు. పేకాటలో సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గల్లీలు, ఇళ్లలో ఆడితే చుట్టుపక్కల ఉన్నవారు సమాచారం ఇస్తే పోలీసులకు దొరికిపోతామని పేకాటరాయుళ్లు పక్కాగా ఈ అడ్డాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. గదులు అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్నట్లు సమాచారం. అనుకోని సంఘటనలు జరగకముందే పేకాట స్థావరాలపై దాడి చేసి కట్టడి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.