Collector Koya Shri Harsha : నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు
రామగుండం నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
దిశ, గోదావరిఖని : రామగుండం నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు. రామగుండంలో మల్కాపూర్ శివారులో గల స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కలెక్టర్ సందర్శించారు. రామగుండం నగరం పరిసర గ్రామాలలో సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసిన తరువాత, వ్యర్థాలను ఇక్కడికి తరలించి ట్రీట్ చేయాలని, ఎఫ్.ఎస్.టీ.పీను మహిళా సంఘాల ద్వారా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పురపాలక కార్యాలయంలో నగర అభివృద్ధి, పారిశుధ్యం, తదితర అంశాల పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. టీ.యూ.ఎఫ్.ఐ.డీ. సీ ద్వారా రామగుండం నగరానికి మంజూరు చేసిన రూ.100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలు,
అమృత్ 2 పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, వన మహోత్సవం కింద మొక్కల పెంపకం, పెండింగ్ పన్ను వసూలు వివరాలు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ టీ.యూ.ఎఫ్.ఐ.డీ.సీ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల టెండర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పనులు త్వరగా గ్రౌండ్ చేయాలని అన్నారు. జంక్షన్ల అభివృద్ధి, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, స్టోర్మ్, వాటర్ డ్రైయిన్స్, మీడియన్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, తాగు నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు తదితర పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రామగుండం నగరంలో గోశాల వెనుక వైపు రూ.4 కోట్లతో చేపట్టే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు తుది ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అమృత్ 2 పథకం కింద 255 కోట్లకు పైగా నిధులతో
నగరంలో చేపట్టనున్న ఎస్.టీ.పీ నిర్మాణ పనుల పురోగతి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. రామగుండం పురపాలక సంఘంలో ఆస్తి పన్ను, నీటి బిల్లులు, ఇతర ఆదాయ మార్గాల్లో వసూలు చేయాల్సిన బిల్లులు త్వరగా వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గోదావరిఖని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న 355 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ ఆర్ఐలు, ఈఈ ఆర్ అండ్ బీ, డీఈ జాఫర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జావిద్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.