తరిమితే దాడులు.. బెంబేలెత్తుతున్న ప్రజలు..
హుజురాబాద్ లో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ లో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. కోతుల భయంతో పగలు కూడా కిటికీలు, తలుపులు మూసుకొని ఉంటున్నారు. జాలి డోర్లను సైతం తీసుకొని కోతులు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కోతులు వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా బయలుదేరి కాలనీల పై విరుచుకుపడుతున్నాయి. ఇల్లు దుకాణాల్లోని తినుబండారాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రజల పై దాడులకు దిగుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోతుల నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఇళ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ...
అడవిలో జీవించాల్సిన కోతులు పట్టణం మీద పడుతున్నాయి. అటవీ ప్రాంతాలు రోజురోజుకు తగ్గిపోవడం వాటికి ఆహారం దొరకకపోవడంతో పట్టణంలోకి ప్రవేశిస్తున్నాయి. గుంపులు గుంపులుగా కాలనీలో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో తయారు చేసుకున్న భోజనాలతో పాటు పప్పు దినుసులు పట్టుకెళ్తున్నాయి. కిరాణా షాపులు, పండ్ల దుకాణాల దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బెడదతో రేకుల, పెంకుటిల్లు ధ్వంసం అవుతున్నాయి. ఆరుబయట ఎండబెట్టిన ఆహార పదార్థాలను పట్టుకెళ్తున్నాయి. ఇళ్లలో ఉన్న మామిడి, జామ, బొప్పాయి తదితర పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి.
భయాందోళనలో ప్రజలు..
కోతుల బెడద రోజురోజుకూ ఎక్కువ కావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల క్రితం సూపర్ బజార్ ఏరియాలో పలువురిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇళ్లలో వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో అవి ప్రజల పై దాడులకు ఎగబడుతున్నాయి. ఇప్పటికి వందల సంఖ్యలో ప్రజలు కోతుల దాడికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. భవనాల పై గుంపులు గుంపులుగా చేరి వచ్చిపోయే వారిపై దాడులు చేస్తున్నాయి. కోతుల బెడద తీవ్రం కావడంతో కొంతమంది టపాసులు పేల్చి, గుల్లేరులతో వాటిని తరిమికొడుతున్నారు.
నియంత్రణ చర్యలు చేపట్టాలి..
అధికారులు, మున్సిపాలిటీ పాలకవర్గం కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, బంధించి అటవీ ప్రాంతాలకు తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోతుల నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి బారి నుంచి ప్రజలను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కోతుల బెడద నుంచి విముక్తి చేయాలని వారు అధికారులకు మున్సిపల్ పాలకవర్గాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కోతులతో ఇబ్బంది పడుతున్నాం.. కేసి రెడ్డి లావణ్య.. నరసింహారెడ్డి కౌన్సిలర్..
కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా వార్డులో దుకాణాల సముదాయాలు ఎక్కువ ఉంటాయి. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో సూపర్ బజార్ ఏరియాకు వస్తారు. దుకాణాల్లో చొరబడి వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. పళ్ళు, పప్పు దినుసులను ఎత్తుకెళుతున్నాయి. వాటిని తరిమే ప్రయత్నం చేస్తే దాడులు చేసి గాయపరుస్తున్నాయి. వాటిని పట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేలా మున్సిపల్ లో నిధులు కేటాయించి చర్యలు తీసుకోవాలి.