MLA Kavvampally : స్వచ్ఛ మానకొండూరుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం
మానకొండూరు గ్రామ అభివృద్ధిపై గ్రామ పంచాయతీ
దిశ, మానకొండూర్ : మానకొండూరు గ్రామ అభివృద్ధిపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ మండల ప్రత్యేక అధికారి డీఆర్డీఏ పీడీ శ్రీధర్ , ఎంపీడీఓ, ఎంపీవో, ఆర్&బి, ఎలక్ట్రిసిటీ ఏఈలు పంచాయతీ కార్యదర్శి,గ్రామ ప్రజలు, వ్యాపారస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూరు గ్రామం నియోజకవర్గ ప్రధాన కేంద్రం అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేకుండా రోడ్లపై ఎటు చూసిన చెత్త చెదారం, మురికి నీరు, పిచ్చి మొక్కల తో నిండి పోయిందని అన్నారు. గ్రామ ప్రజలు, వ్యాపారస్తులకు అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. గ్రామ పంచాయతీ లో నిధులు లేకపోవడంతో మంగళవారం ఒక్కరోజే మండలంలోని పదిహేను గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది 85 మందిని, ట్రాక్టర్ లను తెప్పించి పని చేయించడం జరిగిందని అన్నారు. వీధి దీపాలు దాదాపు 270 వీధి దీపాలు పని చేయడం లేదు. కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మానకొండూరు మీదుగా కరీంనగర్ - వరంగల్ ప్రధాన రహదారికి ఇరువైపుల 45 ఫీట్ల లోపు అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు స్వచ్చందంగా వాటిని మీరే తొలగించాలని వ్యాపారస్థులకు వారు తెలిపారు. దుకాణ యజమానులు, ప్రజలు రోడ్లపై చెత్త వేయవద్దని తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ చెత్త వాహనానికి అందించాలని కోరారు. వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ట్రేడ్ లైసెన్స్ లేని వారు ఇప్పుడైనా తీసుకొని ప్రభుత్వానికి సహకరించగలరని అన్నారు. మానకొండూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. స్వచ్ఛ మానకొండూర్ గ్రామంగా తీర్చి దిద్దుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి శ్రీధర్, స్థానిక వ్యాపారస్తులు, పంచాయతీ కార్యదర్శి రేవంత్ రెడ్డి,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.