లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి : అదనపు కలెక్టర్
లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ నీటిని దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. ఆయన్ను స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ టి.శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏవో బి.గంగయ్య, సహాయ వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.