Kunamneni Sambasiva Rao : తెలంగాణలో బీజేపీని నివారిస్తాం..

దేశంలో మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ పార్టీని తెలంగాణలో

Update: 2024-08-20 10:34 GMT

దిశ,హుజురాబాద్ రూరల్: దేశంలో మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ పార్టీని తెలంగాణలో నివారిస్తామని సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో జగిన బహిరంగ సభలో, అనంతరం మధువని గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీకి దేశంలో పోరాటం చేసిన చరిత్ర లేదని మతాలను అడ్డుపెట్టుకొని, రాజకీయాలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు ఎంతో కాలం నిలవ లేవని ఆయన తెలిపారు. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తే అయోధ్యలో ప్రజలు ఓడించారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ పార్టీ ధృతరాష్ట్రుని కౌగిలి లో ఉందని పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో భూస్థాపితం అవుతుందని, ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీ కొంతమేర చేశారని, మరి కొంతమందికి చేయాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ పార్టీపై పోరాటం చేయడానికి కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, ఏ పార్టీకి వత్తాసు పలకబోదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల పక్షాన సలహాలు సూచనలు చేస్తామని తెలిపారు. అనంతరం జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అనేక సవాల్ లు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని ఆయన కోరారు.

భూములు సర్వే చేయకుండా ఏ చట్టం తీసుకువచ్చిన అది పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. హామీలను అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కార్యకర్తల బిల్లులను, సర్పంచుల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, గోవిందుల రవి, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామారాపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News