మిమ్మల్ని నమ్మి బయట తిరుగుతున్న.. కేటీఆర్ హాస్యాస్పద వ్యాఖ్యలు

సిరిసిల్ల ప్రజలను నమ్మి బయట నియోజక వర్గాల్లో తిరుగుతున్నానని,

Update: 2023-11-06 08:43 GMT

దిశ,సిరిసిల్ల : సిరిసిల్ల ప్రజలను నమ్మి బయట నియోజక వర్గాల్లో తిరుగుతున్నానని, రాజుగారి పాల కథ లెక్క చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ప్రజలను విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో పార్టీ చేరికల కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల ప్రజలను నమ్మి బీఆర్ఎస్ పార్టీ విజయం, ముచ్చటగా మూడోసారి తమ ప్రియతమ నేత కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి బయట నియోజకవర్గాల్లో ప్రచారం కోసం తిరుగుతున్నానని, మీరు ఆగమై తనను బేజారు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బయటవాల్లను, ప్యారాషూట్ లీడర్లను దించే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు. ఎట్లా ఉండే సిరిసిల్ల సిరిసిల్ల ఎట్లా అయ్యిందో సిరిసిల్ల ప్రజలకు తెలుసని, చిల్లర మాటలకు లొంగిపోవద్దన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపినప్పుడు చిన్న చిన్న కొరతలు ఉంటాయని, కోపమైన, అసంతృప్తి అయిన మనవాళ్ళ పైనే చూపిస్తారని, గులుగుడు గులుగుడే గులాబీ జండాకు గుద్దుడు గుద్దుడేనని ప్రజలు అంటున్నారని పలువురు తనతో చర్చించినట్లు చెప్పారు.

మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అయ్యిందని, కులాల పేరిట కుంపటి, మాతల పేరిట మంటలు, ప్రాంతాల పేరిట పంచాయితీలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నడూ పెట్టలేదన్నారు. మన బతుకులు మార్చిన కేసీఆర్ ను మరిచిపోవద్దని, నిన్ననే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు... తాము కూడా రాష్ట్రంలో సెంచరీ కొట్టడం పక్క అని ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో వైయస్సార్ టీపీ జిల్లా అధ్యక్షుడు చోక్కాల రాము తో పాటు 200 మంది చేరారు. కండువా కప్పి వారిని కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ రాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, యు విద్యార్థి నేత, కళాకారుడు దరువు ఎల్లన్న, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, టెక్స్టైల్, పవర్ లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నరసయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News