మా టీచర్లు మాకు కావాలి.. కస్తూర్బా పాఠశాల విద్యార్థుల నిరసన..
మా టీచర్లు మాకు కావాలంటూ మల్యాల కస్తూర్బా పాఠశాల (బాలికల) విద్యార్థులు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
దిశ, మల్యాల : మా టీచర్లు మాకు కావాలంటూ మల్యాల కస్తూర్బా పాఠశాల (బాలికల) విద్యార్థులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. కస్తూర్బా పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత 12 రోజులుగా నిర్వహిస్తున్న స్వయం శిక్షా అభియాన్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొంటున్నారు. విద్యార్థుల బోధనకు అంతరాయం కలగకుండా జిల్లా విద్యా అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి జయసింహారావు మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తాత్కాలికంగా కస్తూర్బా పాఠశాలకు డిప్యూటేషన్ చేస్తూ తరగతులు నిర్వహించేలా చూశారు. అయితే తమ టీచర్లు తమకు కావాలంటూ ఏఎన్ఎం, వాచ్మెన్ తప్ప తమను రాత్రి సమయాల్లో చూసుకోవడానికి క్లాస్ టీచర్ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులను క్లాసులకు రానివ్వకపోవడంతో కస్తూర్బా పాఠశాలకు వెళ్లిన ఎంఈఓ జయసింహారావు విద్యార్థులకు నచ్చజెప్పి తరగతి గదులకు పంపించారు.