కేసీఆర్ ను ఓడగొట్టేది రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలంతా కసితో ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి : సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలంతా కసితో ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఓడించే దమ్ము రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. రేవంత్ కామారెడ్డి బరిలో ఉంటే కేసీఆర్ ఓటమి పాలవడం ఖాయమని రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొదటి సీటు కూడా కామారెడ్డి అవుతుందని జోష్యం చెప్పారు.
గతంలో ఎన్టీఆర్‌ను చిత్తరంజన్ దాస్ ఓడించినట్లుగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఓడిస్తాడన్నారు. కామారెడ్డిలో ప్రతి ఓటరు ఓ కార్యకర్తగా మారి రేవంత్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 నుంచి 80 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సీఎం గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా మారుతోందని చెప్పారని ఇప్పుడు అదే నిజమైందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దొరా సంతకం పెట్టమంటే ఇంజనీరింగ్ ఆఫీసర్లు సంతకం పెట్టారని సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరంను డిజైన్ చేసినందుకు సంబంధిత అధికారులను కటకటాల్లో పెట్టాలని అన్నారు.