అవినీతి కూపంలో జగిత్యాల బల్దియా.. ఒక్కో డిపార్మెంట్ నుంచి లక్షల్లో వసూళ్లు

జగిత్యాల బల్దియా రోజు రోజుకు అవినీతి కూపంలో మునిగిపోతుంది.

Update: 2024-04-19 03:14 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల బల్దియా రోజు రోజుకు అవినీతి కూపంలో మునిగిపోతుంది. పురపౌరులకు అందించాల్సిన సేవల్లో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూల్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పాలక వర్గంలో ఉన్న కొందరు కీలక నేతలకు జగిత్యాల బల్దియా కల్ప తరువుగా మారింది. బల్దియాలోని మూడు కీలక సెక్షన్ల లోని కొందరు ఆఫీసర్ల కు నెల వారి ఆప్తాలు ఇవ్వాలని టార్గెట్ గా పెట్టి మరీ పాలక వర్గంలో కీలక నేతలు వసూళ్ల కు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆఫీసర్లు బదిలీ పై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, జగిత్యాల బల్దియా కు రావాలంటే నే మరి కొందరు ఆఫీసర్లు జంకుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి ఆఫీసర్లు బల్దియా లో ప్రక్షాళ చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

స్థానిక నేతల నుండి కీలక నేతల వరకు వసూళ్లే

జగిత్యాల బల్దియా పరిధిలో కన్స్ట్రక్షన్ చేపట్టాలంటేనే నిర్మాణాలు దారులు జంకుతున్నారు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కనిపిస్తే చాలు కొందరు వార్డు కౌన్సిలర్లు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అవినీతికి ప్రధాన కారణంగా వినిపిస్తుంది. ఇవ్వకపోతే రూల్ ప్రకారం నిర్మాణాల కోసం ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకున్నా కొర్రీలు పెట్టి పర్మిషన్లు రిజెక్ట్ చేపిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇలా రిజెక్ట్ చేసిన పర్మిషన్లకు ఆమ్యామ్యాలు ఇస్తే తిరిగి పర్మిషన్లు మంజూరు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అడిగినంత ఇవ్వకపోతే పర్మిషన్లు మంజూరు చేయలేమని, ఇచ్చిన దాంట్లో కీలక నేతలకు కట్నం ఇచ్చుకోవ్వాల్సిందేనని సంబంధిత డిపార్మెంట్ కు చెందిన కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే చెపుతున్నారు.

మేమేం తక్కువ కాదన్నట్లుగా కొందరు ఆఫీసర్లు

కొందరు సిన్సియర్ ఆఫీసర్లు మాత్రం లీడర్లకు ఇచ్చే కట్నాలు తమ కు భారం కాకూడదాని వసూళ్లు చేసి ముట్ట చెబుతున్నట్లు సమాచారం. అయితే మరికొందరు ఆఫీసర్లు మాత్రం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లుగా లీడర్ల పేరు చెబుతూ జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తుంది. నిర్మాణదారులు అడిగింత ఇచ్చుకుని ఏలాగోలా పర్మిషన్ తీసుకున్న కూడా క్షేత్ర స్థాయి లో కొందరు కౌన్సిలర్ల ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. తమ వాట ఇవ్వకుంటే ఫిర్యాదులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని కీలక నేతలు, ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరి వాటా వాళ్లకు ఇవ్వాలని ఉచిత సలహాలు ఇస్తున్నారట.

రెవెన్యూ, సానిటేషన్ లోనూ అక్రమాలే

బల్దియా లోని రెవెన్యూ, సానిటేషన్ సెక్షన్ల లోనూ అక్రమాలు జరుగుతున్నాయినే విమర్శలు ఉన్నాయి. గతం లో మ్యూటేషన్లు, సెల్ఫ్ అసెస్ మెంట్ విషయం లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రెవెన్యూ ఆఫీసర్ ను సరెండర్ చేయాలని కౌన్సిలర్లు జిల్లా ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆపేందుకు అప్పట్లో కీలకంగా పని చేసిన నేతకు డబ్బులు ఆఫర్ చేసినట్లు కూడా వినిపించింది. ప్రస్తుతం పాలక వర్గం లోని కీలక నేత భర్త తనకు క్లాస్‌మెంట్ అని తనను ఎవరూ ఏం చేయలేరని బహిరంగం గానే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సానిటేషన్ డిపార్మెంట్ లో డిజిల్, రిపేర్ల పేరు తో అక్రమాలతో పాటు సిబ్బంది హజరు విషయంలో అవకతవలు కూడా జరిగినట్లు వినికిడి. ఇప్పటికే ఈ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణకు అదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Tags:    

Similar News