లీగల్‌గా ఇల్లీగల్ పనులు.. మాజీ ప్రజా ప్రతినిధి భర్త నిర్వాకం

ఇసుక తవ్వి తరలించాలంటే సంబంధిత అధికారుల

Update: 2024-09-21 11:40 GMT

దిశ,కొడిమ్యాల : ఇసుక తవ్వి తరలించాలంటే సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరి. కానీ ఓ మాజీ ప్రజా ప్రతినిధి భర్త మాత్రం రూల్స్ తమకు అక్కరలేదు అన్నట్టుగా ఇసుక తరలింపుకు అక్రమంగా టెండర్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మాజీ ప్రజా ప్రతినిధి భర్త నిర్వాకం బయటపడింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల వాగు నుండి ఇసుక తవ్వి తరలించుకునేందుకు మాజీ ప్రజా ప్రతినిధి భర్త అనధికారికంగా టెండర్ నిర్వహించాడు. అంతే కాకుండా టెండర్ ద్వారా వచ్చిన డబ్బులు జీపీ అభివృద్ధికి పనికొస్తాయని నమ్మబలికాడు. అయితే ఓ వ్యక్తి రూ. 86 వేలకు ఇసుక తరలించుకునేందుకు ముందుకు రాగా సదరు వ్యక్తికి టెండర్ దక్కినట్టుగా జీపీ లోని ఓ పుస్తకంలో అనధికారికంగా నమోదు చేశారు.

ఇక దాదాపు సంవత్సరం పాటు సదరు వ్యక్తి వాగు నుంచి ఇసుకను వివిధ అవసరాలపై తరలించుకుపోయాడు. అందుకు ముందుగా ఒప్పుకున్న ప్రకారం రూ.86 వేలను కూడా మాజీ ప్రజాప్రతినిధి భర్తకు ముట్ట చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉన్న వచ్చిన డబ్బులు మాత్రం జీపీ అకౌంట్ లో జమ కాలేదు. ఈ విషయమై జీపీ కార్యదర్శి వెంకటేష్ ను వివరణ కోరగా ఇసుక తరలింపుకు అనధికారికంగా టెండర్ నిర్వహించినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకు సంబంధించి ఎలాంటి డబ్బులను జీపీ అకౌంట్ లో ఇంతవరకు జమ చేయ లేదని స్పష్టం చేశారు. ఇసుక తరలించుకున్న వ్యక్తి మాత్రం ముందుగా ఒప్పుకున్న ప్రకారం రూ. 86 వేలను ఇదివరకే చెల్లించినట్లుగా తెలిపాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఇసుక టెండర్ నిర్వహించడానికి మాజీ ప్రజాప్రతినిధి భర్తకు ఏ అధికారం ఉందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్రమంగా ఇసుక తరలించడానికి టెండర్ నిర్వహించడమే కాకుండారూ.86 వేలను పక్కదారి పట్టించిన విషయంలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News