హుజూరాబాద్‌లో కొన్నేళ్లుగా అక్రమ దందా.. పట్టించుకోని అధికారులు
హుజూరాబాద్ కొత్తపల్లి శివారులో కల్తీ నెయ్యి తయారు చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు..
దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ కొత్తపల్లి శివారులో కల్తీ నెయ్యి తయారు చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నెయ్యి తయారు చేస్తున్న కేంద్రాన్ని ‘దిశ’ గుర్తించింది. ఆ ప్రాంతానికి వెళ్లగా కల్తీ వ్యవహారం కళ్లకు కట్టినట్టు కనిపించింది. కంపెనీ నిర్వాహకుడు నాగేశ్వరరావును నెయ్యి తయారీలో ఎలాంటి ముడిసరుకు వాడుతున్నారని ప్రశ్నించగా తడబడ్డాడు. ఫొటో తీయడానికి ప్రయత్నిస్తే తీయకూడదని తిరగబడడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే... హుజూరాబాద్ పట్టణ శివారులోని కొత్తపల్లి ప్రాంతంలో కల్తీ నెయ్యి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏకంగా బోర్డు పెట్టి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నారు. నెయ్యి తయారీ విధానంలో డాల్డా, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌తోపాటు నెయ్యి ఫ్లేవర్, రంగు, రుచి కోసం ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ రసాయనాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తయారు చేసిన కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, స్వీట్ హాజులు, దేవాలయాలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని అనుష్ కంపెనీ పేరుతో ముద్రించిన కవర్లలో ఆఫ్ లీటర్, లీటర్ చొప్పున నెయ్యిని ప్యాకింగ్ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ దందా గత కొన్నేళ్లుగా సాగుతున్నా మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నామమాత్రంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని గత కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
పొయ్యి వెలగకుండానే నెయ్యి తయారీ
డెయిరీ సంస్థల నుంచి వెన్న కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా ఎలాంటి మ్యాన్ ఫ్యాక్చర్ లేకుండానే ఇక్కడ నెయ్యి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ప్యాకింగ్ మిషన్‌ను ఏర్పాటు చేసి ఎటువంటి లేబుల్స్ లేని కవర్లలో నింపుతూ దుకాణాలకు విక్రయిస్తున్నారు. లేబుళ్లు లేని ప్యాకెట్లను స్వీట్ హౌస్, రెస్టారెంట్లు, దేవాలయాల వద్ద సామగ్రిని విక్రయించే దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. లేబుల్‌తో ప్యాకింగ్ చేసే కవర్లను కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ తయారు కేంద్రాన్ని పరిశీలిస్తే ఇక్కడ నెయ్యి తయారు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడం శోచనీయం.
అంతా కల్తీమయం
నేడు వంటిల్లు అంతా కల్తీ అవుతుంది. తినే ప్రతి ముద్దలో అవే జాడలు కనిపిస్తున్నాయి. పప్పులో వాడే నెయ్యి, కూరలో వాడే పసుపు, మసాలాలు, ధనియాల పొడి ఇలా అన్ని కల్తీ అయితే ఇక మనిషి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఒకేసారి కనిపించకపోయినా క్రమేనా ఆరోగ్యం క్షేణించే పరిస్థితి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కల్తీ నెయ్యి మనిషి శరీరానికి ఎంతో హాని చేస్తుందని వారు పేర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు
పట్టణ శివారులో కల్తీ నెయ్యి అక్రమ దందా గత కొన్నేళ్లుగా సాగుతున్న మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. కల్తీ పదార్థాలతో నెయ్యి తయారీ గురించి సంబంధిత అధికారులకు తెలిసిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కల్తీ నెయ్యి వ్యవహారం అధికారులకు తెలిసినా తయారీ దారి నుంచి మామూలు దండుకుంటున్నట్లు తెలుస్తోంది.