సీఎం వేములవాడ పర్యటన చారిత్రాత్మక ఘట్టంగా మిగలనుంది : ఆది శ్రీనివాస్
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం చారిత్రాత్మక ఘట్టమని, ఇది రాజన్న భక్తులకు గుండె ఉప్పొంగే సమయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈనెల 20వ తేదీన సీఎం వేములవాడ పర్యటన నేపథ్యంలో రాజన్న ఆలయ గుడి చెరువు లో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం రాత్రి స్థానిక నాయకులతో కలిసి ఆది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే, యువరాజుగా పిలువబడిన కేటీఆర్ సిరిసిల్ల జిల్లా అభివృద్ధిని విస్మరించారని, రాజన్న సాక్షిగా రాజన్న ఆలయానికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను తీర్చలేదని, జిల్లాలోని రైతన్నలు, నేతన్నలు, రాజన్న భక్తుల కష్టాలు తీర్చలేదని, ఇచ్చిన హామీలు మర్చిపోయి జిల్లాను వెనకబడేలా చేశారని మండిపడ్డారు.
కానీ తాము అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు రోడ్ల విస్తరణ, బ్రిడ్జి నిర్మాణం తదితర పనులకు రూ.127కోట్లు నిధులు కేటాయించామని, నేతన్నల 30 ఏండ్ల కల నెరవేర్చేలా రూ.50కోట్లతో యారన్ డిపో ఏర్పాటు చేస్తున్నామని, మేడిపల్లి మండల విద్యార్థుల చిరకాల కలగా మారిన జూనియర్ కళాశాల మంజూరు చేయించామని, మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లకు నిధులు మంజూరు అయ్యాయని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగించే క్రమంలో సీఎం వేములవాడ పర్యటన జరగనుందని, ఈ పర్యటనతో మహోన్నత కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నామని, ఈ నెల 20న ఉదయం 10గంటల వరకు జిల్లా ప్రజలు, రాజన్న భక్తులు పెద్ద ఎత్తున రాజన్న ఆలయ గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభకు తరలి వచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.