చెరువుల పరిరక్షణకే హైడ్రా

చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడిందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

Update: 2024-10-15 12:27 GMT

దిశ,సుల్తానాబాద్ : చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడిందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన చేప పిల్లలను సుల్తానాబాద్ పెద్ద చెరువులో వదిలి మాట్లాడారు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలనే గొప్ప సంకల్పంతో 100 శాతం సబ్సిడీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులలో చేప పిల్లల పెంపకాన్ని చేపట్టినట్టు తెలిపారు. గొలుసు కట్టు చెరువులు, కుంటల ద్వారా పంటలు సమృద్ధిగా పండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ నది ప్రక్షాళన చేపడుతుంటే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

    మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 25 వేల రూపాయలు ఇచ్చి సురక్షితంగా తరలిస్తున్నారని తెలిపారు. కొందరు గొలుసుకట్టు కాలువలను ఆక్రమించుకున్నారని వారిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, అధికారులు సమగ్ర విచారణ చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే నాలుగు లక్షల మంది రైతులను గుర్తించారని, త్వరలోనే వారికి రుణమాఫీ చేసి ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనానికి స్థలం కేటాయించాలని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే తహసీల్దార్ కు 5 గుంటల స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.

     అనంతరం ఎమ్మెల్యేను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నరసయ్య, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, సుల్తానాబాద్ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మినుపల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, సాయిరి మహేందర్, అబ్బాయి గౌడ్, చిలుక సతీష్, కిషోర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

Tags:    

Similar News