బీఆర్ఎస్ నేత భూ భాగోతం..!

సిరిసిల్లలోని ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండగా బకాసురుల్లా మింగేసినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి.

Update: 2025-01-01 02:16 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలోని ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండగా బకాసురుల్లా మింగేసినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే అసైన్ భూముల ఖబ్జాల విషయంలో కొంతమంది నేతల పై కేసులు కాగా, తాజాగా ఓ బీఆర్ఎస్ నేత ఆటవి భూమి కబ్జా విషయం వెలుగులోకి వచ్చింది. సదరు నేతలు అటవీ శాఖ భూములను కూడా వదలలేదనే ప్రజలు చర్చించుకుంటున్నారు. వీర్నపల్లి మండలంలోని ఓ బీఆర్ఎస్ నేత అడ్డదారిలో పోడు పట్టా పొందడమేకాక, నిబంధనలకు నీళ్ళొదిలి వాటిని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.

వీర్ణపల్లిలో నయా భూ దందా..

జిల్లాలోని వీర్నపల్లి మండలంలో ప్రభుత్వ భూములలో పాటు అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. మండలంలోని ఓ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వీర్నపల్లి వెంకట్రాయిని చెరువు ప్రాంతంలో 4 ఎకరాల భూమిని 2022లో ఓ వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. కాగా తర్వాత దానికి అనుకోని ఉన్న అటవీ శాఖ భూమిని తాను 2005కు ముందు నుండి కబ్జాలో ఉన్నట్లు సృష్టించి, అప్పటి అటవీ శాఖ అధికారుల చేతులు తడిపి పోడు పట్టా పొందినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మళ్లీ అక్కడితో ఆగకుండా 3 నుంచి 4 ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు నేత పై అటవీ శాఖ అధికారులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలిసింది.

అమ్మకానికి పోడుపట్టా భూములు ?

ఇంతవరకు బాగానే ఉన్నా సదరు బీఆర్ఎస్ నేత కొనుగోలు చేసిన నాలుగు ఎకరాలు, పోడు పట్టా పొందిన మూడెకరాలతో పాటు మరో మూడు నుంచి నాలుగు ఎకరాల కబ్జా చేసిన అటవీ భూమిలో నాలుగు ఎకరాలను ఇతరులకు అమ్ముకున్నట్లు సమాచారం. వాస్తవానికి పోడు పట్టా భూములను అమ్మడం, కొనడం నేరం. అయితే సదరు నేత ఒక్కో ఎకరానికి 10 లక్షల చొప్పున 40 లక్షలకు 4 ఎకరాలను ఇతరులకు విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. అమ్మకానికి సహకరించిన అటవీ శాఖ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. తీరా విషయం బయటకి పొక్కడంతో అటవీశాఖ అధికారులు ఆ నేత సాగు చేస్తున్న భూమిలో కొంత భాగం పంటను తీసివేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నిరుపేద కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీర్నపల్లి మండల ప్రజలు కోరుతున్నారు.

పోడు పట్టా భూములను అమ్మితే ఉపేక్షించేది లేదు.. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్.కల్పనా దేవి..

పోడు పట్టా ఇచ్చిన భూములను అమ్మకం చేసినట్లు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. పోడు పట్టా ఇచ్చిన భూములను అమ్మకం చేయడం, కొనుగోలు చేయడం నేరం. పోడు పట్టా భూములను అమ్మితే ఉపేక్షించేది లేదు. అమ్మినా, కొనుగోలు చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తాం. అంతే కాకుండా ఇచ్చిన భూమిని వాపసు తీసుకొని, మళ్ళీ అందులో మొక్కలు నాటి అడవిగా అభివృద్ధి చేస్తాం. అలాంటివి వారికి సహకరించిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. దాంతో పాటు అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూములలో ఉన్న చెట్లను నరికి కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వెంకట్రాయిని చెరువు ప్రాంతంలో అటవీ భూమిని కబ్జా చేసిన ఓ వ్యక్తి పై కేసు కూడా నమోదు చేశాం అన్నారు.


Similar News