మద్యం తాగి పట్టుబడితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.. ఎస్సై నవీన్ కుమార్
కథలాపూర్ మండల ప్రజలకు, యువతకు ఎస్సై నవీన్ కుమార్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, కథలాపూర్ : కథలాపూర్ మండల ప్రజలకు, యువతకు ఎస్సై నవీన్ కుమార్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలను శాంతియుతంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి రోడ్ల పైన కేకులు కట్ చేసిన, బాణాసంచా కాల్చిన చట్టరీత్యా నేరమని అన్నారు. అయితే అదే రోజున వాహనాల తనిఖీ కూడా నిర్వహిస్తామని ఎవరైనా బైకుల పైన నిబంధనలకు విరుద్దంగా ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు కలిసి తిరిగినా, అలాగే మద్యం తాగి వాహనాలు నడుపుతూ అల్లర్లు సృష్టించినా, ఇతరులకు ఇబ్బందులు గురి చేసిన, అనుమతులు లేకుండా ఒకే చోట గుంపులుగా చేరిన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
అంతే కాకుండా మద్యం తాగి పట్టుబడినట్లైతే వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కేసులతో యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ నవీన్ కుమార్ కోరారు. అలాగే యువత కొత్త సంవత్సరం వేడుకలంటూ విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ రోడ్డు ప్రమాదంలో అనుకోకుండా ఏదైనా జరిగితే వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చ వద్దని, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఇంటివద్దే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.