తెల్లవారుజామున అద్దె బస్సుల డ్రైవర్ల మెరుపు సమ్మె
కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో హైర్ బస్సుల డ్రైవర్ల మెరుపు సమ్మె చేస్తున్నారు. తెల్లవారుజామున...Bus Drivers Protest at Karimnagar Bus station
దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో హైర్ బస్సుల డ్రైవర్ల మెరుపు సమ్మె చేస్తున్నారు. తెల్లవారుజామున ప్రారంభమైన ఆ సమ్మెతో పల్లె వెలుగుతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే అద్దె బస్సులన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుండి కరీంనగర్ కు వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు కూడా సకాలంలో స్కూళ్లకు చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. నామ మాత్రపు వేతనాలతోపాటు వేధింపులు కూడా తీవ్రమయ్యాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే వేతనాలు పెంచడంతోపాటు ఆర్టీసీ అధికారులు తమపై చూపుతున్న వివక్షను విడనాడాలని, వేధింపులను నిలువరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ముందుకు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ హైర్ బస్ డ్రైవర్లు చేస్తున్న నిరసతో బస్ స్టేషన్ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆందోళనలతో హోరెక్కింది. హైర్ బస్సు డ్రైవర్ల నిరసనకు సీఐటీయూ కూడా మద్దతు తెలపడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దాదాపు నెల రోజుల క్రింత కూడా ఇదే విధంగా మెరుపు సమ్మెకు దిగడంతో అధికారులు, అద్దె బస్సుల యజమానులు చర్చలు జరపడంతో అప్పుడు ఆందోళనలు నిలిచిపోయాయి. తిరిగి మళ్లీ అవే డిమాండ్లతో మెరుపు సమ్మెకు దిగడం గమనార్హం. హైర్ బస్సు డ్రైవర్ల స్ట్రైక్ తో ప్రైవేట్ బస్సులన్నీ ఎక్కడిక్కడా నిలిచిపోగా, గ్రామీణ ప్రాంతాల ప్రయాణీకులు గమ్య స్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపోల ముందు మోహరించారు.