BRSV state leader : విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే..

గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న విద్యార్థుల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆరోపించారు.

Update: 2024-07-27 15:39 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న విద్యార్థుల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆరోపించారు. మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మరణం పై స్పందిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో స్థానిక బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రాజారపు గుణా ఆదిత్య పాముకాటు వల్ల అస్వస్థతకు గురై చనిపోయాడని, తనతోపాటు హర్షవర్ధన్, గణేష్ అనే అనే విద్యార్థులు కూడా అస్వస్థత గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాగా చదువుకొని తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని గురుకుల పాఠశాలకు పంపిస్తే తన కొడుకు శవమై తిరిగి వచ్చాడని గుణాదిత్య తల్లిదండ్రులు విలపిస్తున్నారన్నారు. పేద బలహీన వర్గాల విద్యార్థుల పై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, విద్యార్థి మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.

సంబంధిత అధికారులు, హాస్టల్ సిబ్బంది పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రత్యేక అధికార బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించి, సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నవీన్, కోడం వెంకటేష్, రుద్రవేణి సుజిత్, కోడి రోహిత్, సాయి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News