స్కీములంటే బీఆర్ఎస్.. స్కాములంటే కాంగ్రెస్ : కోరుకంటి చందర్
స్కీములంటే బీఆర్ఎస్ పార్టీ.. స్కాములంటే కాంగ్రెస్.. ఈ రోజు గోదావరిఖనిలో జరిగిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ, ఒక దొంగకు మరో దొంగ మద్దతు పలకడానికి వచ్చినట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎద్దేవా చేశారు.
దిశ, గోదావరిఖని : స్కీములంటే బీఆర్ఎస్ పార్టీ.. స్కాములంటే కాంగ్రెస్.. ఈ రోజు గోదావరిఖనిలో జరిగిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ, ఒక దొంగకు మరో దొంగ మద్దతు పలకడానికి వచ్చినట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎద్దేవా చేశారు. స్థానిక చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి సభలో ప్రజల స్పందన చూస్తేనే బీఆర్ఎస్ పార్టీ రామగుండంలో అఖండ మెజారిటీతో గెలువబోతోందని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని అర్థమైందన్నారు. ఫెన్షన్ పొందుతున్నవారు చెయ్యెత్తమంటే.. ఒక్క చెయ్యి పైకి లేవలేదని, అంటే కేసీఆర్ పాలనలో పెన్షన్ పొందుతున్నవారు కృతజ్ఞతగా సభలో పాల్గొనక బహిష్కరించారన్నారు. ఆఖరికి కాంగ్రెస్ కు ఓటేసే వాళ్ళు చెయ్యెత్తమని కోరినా, స్పందన కరువవడంతోనే బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు.
బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, కాంగ్రెస్ స్కాముల పార్టీ అన్నారు. బోపోర్స్ నుండి బొగ్గు బ్లాకులదాకా కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమేనన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. కాంగ్రెస్ హయాంలో బొగ్గు బ్లాకులను తమ అనుయాయులకు కట్టబెట్టినందుకే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెండర్ ద్వారానే బొగ్గు బ్లాకులను కేటాయించాలని ఎంఎండీఆర్ - 2014 యాక్ట్ పార్లమెంట్ లో బిల్లు తెచ్చిందన్నారు. బొగ్గు కుంభకోణంలో నాటి మంత్రి దాసరి నారాయణరావు జైలుకెళ్లిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. 1975లో ఓసీపీలను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయని, ఈ ప్రాంత కార్మికులు మరో ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకే జిడికే 5వ గనిని ఓసీపీగా మార్చాల్సి వచ్చిందని, ఒసీపీ - 5 నూతన గని కాదన్నారు. ఆ మాత్రం అవగాహనలేని నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు.
ఒకనాడు సోనియా గాంధీ బలి దేవత అన్న రేవంత్ రెడ్డి, నేడు సోనియాను తెలంగాణ దేవత అంటున్నాడని, అది నాలుకా తాటిమట్టా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేయడమేగాక ఉద్యమ స్పూర్తిలో భాగం చేసిన కవితక్కను విమర్శించడాన్ని ప్రజలంతా చీదరించుకొంటున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు చైతన్యానికి మారుపేరని, ఉద్యమ నేపథ్యం కలిగినవారని, ఉద్యమ నేలపై ఉద్యమద్రోహులు, టూరిస్టులు, దొంగల దొంగ మాటలు నమ్మబోరన్నారు. ఈ విలేఖరుల సమావేశానికి రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ నారదాసు లక్ష్మన్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, మాదాసు రామమూర్తి, జేవి.రాజు చిప్ప రాజేష్ జిమ్మిబాబు, అనుముల కళావతి పిల్లి రమేష్, ముల్కల్ల గోవర్దన శాస్రి, శాంత, లక్ష్మి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
అకాశం నుండి పాతళం వరకు కాంగ్రెస్ అవినీతి
అకాశం నుండి పాతళం వరకు టూజీ స్పెక్ట్రం నుండి బొగ్గు బావుల దాకా కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడిందని కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. శనివారం గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ తో పాటు మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సభను ఈ ప్రాంత ప్రజలంతా తిరస్కరించారని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ విజయం ఖాయమని స్పష్టమైయుందన్నారు. రాష్ట్రంలో దేశంలో 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓసీపీలు మూసివేశారని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు పూర్తివిశ్వాసం ఉందని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో రామగుండంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ని గెలిపించబోతున్నారన్నారు.