ప్రజావాణిలో సర్వర్ డౌన్.. ఇబ్బందులు పడ్డ అర్జీదారులు..
కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపంతో అర్జీదారులు అవస్థలు పడుతున్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపంతో అర్జీదారులు అవస్థలు పడుతున్నారు. ఆర్జీలు సమర్పించేందుకు జనం బారులు తీరడం సర్వర్ పనిచేయకపోవడంతో కలెక్టరేట్ ఆవరణ జనంతో కిటకిటలాడుతుంది. ఎప్పటి లాగే సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. అయితే ప్రజావాణి ప్రారంభం నుంచే సర్వర్ డౌన్ అయింది. దీంతో సాంకేతిక సమస్య తలెత్తి కంప్యూటర్లు మొరాయించాయి.
సిబ్బంది ప్రజల విజ్ఞప్తులను స్వీకరించకపోవడంతో ఆర్జీదారులు ఒకింత అసహనానికి గురయ్యారు. ప్రజలకు సమాదానం చెప్పి సముదాయించాల్సిన అదికారులు అర్జీదారులకు సరైన సమాధానం చెప్పక వారిపై రుస రుసలాడారు. అధికారుల కోరుతో ఆర్జీదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తామని వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి క్యూలైన్ల వద్ద కనీస సౌకర్యాలతో పాటు సర్వర్ సమస్యను అధిగమించేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.