ఆ కులాల పేరు మార్చేందుకు కృషి

బీసీ కులాల్లోని పిచ్చకుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు వేములవాడ పర్యటనకు వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు.

Update: 2025-03-26 11:20 GMT

దిశ, వేములవాడ : బీసీ కులాల్లోని పిచ్చకుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు వేములవాడ పర్యటనకు వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడలో పర్యటించి రాజన్న ఆలయంలోని తమ్మల కులస్తులు, మహాలక్ష్మి వీధిలోని దొమ్మరి, ఓల్డ్ అర్బన్ కాలనీలలో పర్యటించి ఆయా కులాల స్థితిగతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో, ఎకనామిక్ కుల గణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని వెల్లడించారు.

    తమ కులం పేరు విద్యాలయాలు, ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని పిచ్చకుంట్ల, బుడబుక్కల, దొమ్మరి వారు విజ్ఞప్తులు అందజేశారని, వారి కులాల పేరు మార్పు కోసం ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు తాము వచ్చామని చైర్మన్ పేర్కొన్నారు. పరిశీలన అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్లలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తామని వివరించారు. ఏప్రిల్ 10వ తేదీలోగా రాష్ట్రంలోని ఇలాంటి మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, బీసీలలో వెనకబడిన తరగతుల ప్రజలు అధైర్య పడవద్దని, అన్ని కులాల ప్రజలకు సమన్యాయం చేసేందుకు కమిషన్ కృషి చేస్తుందని, బీసీలలోని అట్టడుగు వర్గాలకు బీసీ కమిషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజమనోహర్ రావు, అధికారులు పాల్గొన్నారు. 

Similar News