ఆ ఆస్పత్రిలో ఎవరైనా స్కానింగ్​ చేయొచ్చు..

ధర్మారంలోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ ను అధికారులు సీజ్​ చేశారు.

Update: 2025-03-18 13:35 GMT
ఆ ఆస్పత్రిలో ఎవరైనా స్కానింగ్​ చేయొచ్చు..
  • whatsapp icon

దిశ,ధర్మారం : ధర్మారంలోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ ను అధికారులు సీజ్​ చేశారు. ఇందులో గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తున్నారు అనే సమాచారం మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ నర్సింగ్ హోమ్, గర్భస్థ శిశువు లింగ ఎంపిక నిషేధిత చట్టం నిబంధనలు సరిగా పాటించని కారణంగా ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్​ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. అన్నా ప్రసన్నకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసినట్టు తెలిపారు. ఈ నర్సింగ్ హోమ్ కు 9 బెడ్స్ తో నడుపుటకు అనుమతి ఉండగా 25 కంటే ఎక్కువ బెడ్స్ తో నడుపుతున్నట్టు చెప్పారు.

    ఈ ఆస్పత్రిలో పునర్నిర్మాణ పనులు నడుస్తుండగా అదే అపరిశుభ్రమైన వాతావరణంలో ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, కనీస పేషెంట్ భద్రత కూడా తీసుకోవడం లేదన్నారు. సరిగా బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ చేయడం లేదని, చట్ట ప్రకారం రెండు సంవత్సరాల వరకు గర్భిణిలకు స్కానింగ్ చేసిన వివరాలను జాగ్రత్త పరచాల్సి ఉండగా అలా చేయడం లేదన్నారు. గైనకాలాజిస్ట్ డా. లావణ్యకు మాత్రమే స్కానింగ్ చేసే అర్హత ఉండగా వారితో పాటు అర్హత లేకున్నాఎంబీబీఎస్ డా.శ్రీనివాస్ కూడా స్కానింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. డా. లావణ్య ప్రభుత్వ వైద్యరాలని, నమోదు చేసిన వివరాలు సరితూగడం లేదని అన్నారు. వీరికి గతంలో నోటీసు ఇచ్చినా సరి చేసుకోకుండా అలానే కొనసాగిస్తున్నారని, దాంతో సీజ్ చేసినట్టు తెలిపారు.  


Similar News