రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.

Update: 2024-11-19 05:14 GMT

దిశ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇప్పటికే రాజన్న ఆలయానికి, కార్మిక, ధార్మిక క్షేత్రాలుగా విరాజిల్లుతున్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు వరాల జల్లులు కురిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సైతం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం వేములవాడ పర్యటనకు రెండు రోజుల ముందుగా జిల్లాలోని యువతకు తీపి కబురు అందించింది. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రుద్రంగి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 428 లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏ.టీ.సీ) పేరుతో వృత్తి విద్య కోర్సుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులతో పాటు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖల డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ శిక్షణ కేంద్రంలో 6 కోర్సుల్లో రెండేళ్ల వ్యవధితో కూడిన శిక్షణ అందివ్వనున్నారు. ఒక్కో బ్యాచ్ లో 244 మంది విద్యార్థులు శిక్షణ పొందేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంతో రుద్రంగి మండలంతో పాటు మారుమూల ప్రాంతాల యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం కానుంది. మరోవైపు రుద్రంగిలో శిక్షణ కేంద్రం ఏర్పాటవ్వడం పట్ల స్థానిక ప్రజలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో మహోన్నత కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన విప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.


Similar News