'ఆరోగ్య మహిళ' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి హరీష్ రావు
మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ మహిళలకు అందిస్తున్న 'ఆరోగ్య మహిళ' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
దిశ, కరీంనగర్ టౌన్: మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ మహిళలకు అందిస్తున్న 'ఆరోగ్య మహిళ' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని బుట్టి రాజారాం కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మిషన్ భగీరథ, ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని, గర్భిణుల కోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, మహిళల రక్షణ కోసం షీటీమ్స్, ఆడపిల్లల పెళ్లికోసం కల్యాణలక్ష్మి పథకాలు చేపడుతున్నామన్నారు.
మహిళలు ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పుకోవడానికి బిడియ పడుతుంటారని, కొందరికి ఆర్థిక ఇబ్బందులు తోడైతే, మరికొందరు ఆసుపత్రిలోని మగ డాక్టర్లకు సమస్యలు చెప్పుకోలేక హాస్పిటల్ కు వెళ్లడమే మానేశారని తెలిపారు. అలాంటి వారి కోసమే ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశ పెట్టామని తెలిపారు. ఇందులో మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 8 రకాల వైద్య సేవలు అందిస్తాయని, ఇకపై మహిళా వైద్యులతో, మహిళా సిబ్బందితో "ఆరోగ్య మహిళ" పేరుతో నేటి నుంచి 100 ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల సంఖ్యను దశల వారీగా పెంచుతామన్నారు. ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు 100 ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు చేసి మందులు, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు.
సర్జరీలు, ఇతర అడ్వాన్స్డ్ వైద్య పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక సెంటర్ పెడుతున్నామని తెలిపారు. తల్లి బాగుంటేనే కుటుంబం బాగుంటుందన్న ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీరామనవమి తర్వాత మహిళల కోసం న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ కిట్ ను ప్రసవించిన మహిళకు ఇస్తున్నామని, పోషకాహారంతో కూడిన న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో రూ.3.14 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య మహిళ ప్రాంగణం, పీసీవోడీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ ఫెర్టిలిటీ వార్డ్, 80 లక్షలతో డయాగ్నస్టిక్ రేడియాలజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం మూడో అంతస్తులో రూ.62.5 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు పడకలు, రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాలను మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటే అరిష్టమని భావించి, వారి ఆరోగ్యం కోసం మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించిన మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆడబిడ్డల రక్షణ, సంక్షేమం, ఆరోగ్యం కోసం ఇప్పటి వరకు ఏ సీఎం ఆలోచించలేదన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి, నగర మేయర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సుపెరింటెండెంట్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, తదితరులు పాల్గొన్నారు.