పుట్టెడు దుఃఖంలోను కన్న కొడుకు అవయవాలను దానం చేసిన తల్లి

పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మాతృమూర్తి చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచింది.

Update: 2024-08-18 06:18 GMT

దిశ, గంభీరావుపేట: పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మాతృమూర్తి చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ద్యానబోయిన నర్సింలు- దేవలక్ష్మి‌లకు కుమారడు ద్యానబోయిన నరేష్ (27), కూతురు నవిత ఉన్నారు. ద్యానబోయిన నర్సింలు సంవత్సరన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తండ్రి అనారోగ్యానికి చేసిన అప్పులు తీర్చడానికి, కుటుంబానికి అండగా నిలబడటానికి ద్యానబోయిన నరేష్ దుబాయ్ వెళ్లి, చెల్లి పెళ్లి చేసి మల్లి తిరిగి దుబాయ్ వెళ్దామని రెండు నెలల క్రితం స్వగ్రామం నర్మాలకి వచ్చాడు. గత మంగళవారం లింగన్నపేట గ్రామంలో నరేష్ బంధువులు చనిపోగా.. అక్కడకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో నరేష్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. నరేష్ తలలో రక్తస్రావం కావడంతో ఉన్నత వైద్యం కోసం ఎల్లారెడ్డిపేట లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

నరేష్ పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లి పోవాలి వైద్యులు చెప్పారు. దీంతో చేసేది లేక హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయ్యిందని, బతకడని చెప్పడంతో డాక్టర్స్ అవయవ దానం ఆవశ్యకత, అవగాహన కల్పించారు. అవయవ దానం చేయాలని జీవన్ దాన్ సిబ్బంది కోరడంతో అ మాతృమూర్తి పుట్టాడు దుఃఖంలో ఉన్న పెద్ద మనసు చేసుకుని అవయవ దానానికి అంగీకరించారు. దీంతో అతని రెండు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె తీసి జీవన్దాన్ ద్వారా భద్రపరిచారు. అవయవాల దానం ద్వారా మరో ఆరుగురికి ప్రాణదానం చేసినట్లయ్యిందని వైద్యులు తెలిపారు. శనివారం నరేష్ మృతదేహాన్ని స్వగ్రామం నర్మాలలో ఆంత్యక్రియలు నిర్వహించారు. నరేష్ భౌతికంగా లేకున్నా అతని అవయవాల వితరణతో మరో ఆరుగురులో జీవించే ఉంటాడని అవయవ దానం చేయడం పట్ల నరేష్ మాతృమూర్తికి పలువురు అభినందనలు తెలిపారు. ఇటు భర్త నర్సింలు, కొడుకు నరేష్ ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేని స్థితిలో పడింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News