కాళేశ్వర్ రావు మెడిగడ్డకు రా.. కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
గతంలో కేసీఆర్ ను గవర్నర్ కాళేశ్వర్ రావు అని పొగిడారని.. ఆ కాళేశ్వర్ రావు ఇప్పుడు మేడిగడ్డకు రావాలి.
దిశ,డైనమిక్ బ్యూరో:తెలంగాణలో పాలిటిక్స్ లో వాటర్ వార్ ఆసక్తిగా మారింది. మేడిగడ్డ సందర్శనకు అధికార పక్షం బయలుదేరగా నల్గొండ సభకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిన ఘటనలో వాస్తవాలను వివరించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యేలను తరలించేందుకు నాలుగు బస్సులను సిద్ధం చేసింది. ఈ బస్సుల్లో మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బయలుదేరగా మరోవైపు బహిరంగ సభలో సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు నల్గొండకు బయలుదేరారు. బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ టూర్ కు దూరంగా ఉన్నారు. కాగా ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే సభలో మేడిగడ్డపై సీఎం మాట్లాడారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత అధికార పక్షం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్గొండకు బయలుదేరడంతో రాష్ట్రంలో టూర్ పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి.
‘కాళేశ్వర్ రావు’ మేడిగడ్డకు రావాలి:రేవంత్ రెడ్డి
మేడిగడ్డలో ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ సభ్యుడిపై ఉందని అందుకే అందరిని మేడిగడ్డ పర్యటనకు ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. గతంలో కేసీఆర్ ను గవర్నర్ కాళేశ్వర్ రావు అని పొగిడారని.. ఆ కాళేశ్వర్ రావును మేడిగడ్డకు రావాల్సిందిగా మేము ఇప్పుడు ఆహ్వానిస్తున్నామన్నారు. కేసీఆర్ కు బస్సులో రావడం ఇబ్బందిగా ఉంటే బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రభుత్వ హెలికాప్టర్ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వచ్చి మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించాలని సెటైర్లు వేశారు. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో మీ అనుభవాలను అందరికి వివరించి చెప్పాలన్నారు. మేడిగడ్డ పై రేపో, ఎల్లుండో సభలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజి కూలిందని బీఆర్ఎస్ చెబుతోందని ఇసుక మేడలో బ్యారేజీ కట్టారా అని ప్రశ్నించారు. గతంలో మేడిగడ్డలో ఏం జరిగిందో తెసుకునే అవకాశం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని ఇండియా పాకిస్థాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పోలీసుల పహారా పెట్టారన్నారు. కాళేశ్వరం కేసీఆర్ ఇంట కనకవర్షం కురిపించింది అని తాము అనదల్చుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. తప్పు జరిగిందా? లేదా ? తప్పు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? వారికి విధించాల్సిన శిక్ష ఏంటనేదానిపై చర్చిద్దామన్నారు. కొంత మంది అధికారులు ఫైల్స్ మాయం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేసిందన్నారు.
బీఆర్ఎస్ కు ఎందుకంత ఉలుకు?:శ్రీధర్ బాబు
కాళేశ్వరంపై మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎందుకంత ఉలిక్కిపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపద దుర్వినియోగం అయిందని ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇవాళ అసెంబ్లీ మాట్లాడిన మంత్రి.. వాస్తవాలను వివరించేందుకే సభ్యులను మేడిగడ్డకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, పగుళ్లపై విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా వివరిస్తామన్నారు. మేడిగడ్డపై మేం మాట్లాడితే రాజకీయ కోణంలో చూస్తున్నారని, డ్యామ్ సేఫ్టీ అధికారులే ప్రాజెక్టు నిర్మాణంలో తప్పిదాలను జరిగాయని చెప్పారు. ప్రాజెక్టు పగుళ్లకు కుంగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 40, 50 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు ఇంకా చెక్కుచెదరలేదని గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే మేడిగడ్డ కుంగడానికి కారణం అని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ రిపోర్టు ప్రకారమే చెబుతున్నామన్నారు. వాస్తవాలను తెలుసుకునే అందుకే మేడిగడ్డకు ఆహ్వానిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ది డైవర్ట్ పాలిటిక్స్: హరీశ్ రావు
నల్గొండలో బీఆర్ఎస్ సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ డైవర్స్ పాలిటిక్స్ చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసనసభ జరుగుతున్న తీరు ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉందని మండిపడ్డారు. ప్రాజెక్టులు అప్పగించ వద్దని ప్రభుత్వానికి నిద్రలేపింది మేమే అని ఇవాళ సభ ఉందనే పోటీగా మేడిగడ్డ టూర్ పెట్టారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే అది మేము నిర్మించిన ప్రాజెక్టుల వల్లే జరిగిందని ఏదైనా తప్పు జరిగితే చర్య తీసుకుని పునరుద్దరణ పనులు చేయాలన్నారు. దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదని మండిపడ్డారు. రైతులకు ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు.