రాజముద్రలో నై.. ముస్తాబుకు సై! ఆవిర్భావ వేడుకల్లో కాకతీయ కళాతోరణం!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జూన్ 2వ తేదీన జరగబోయే ఈ ఉత్సవాలకు స్వాగత తోరణంగా కాకతీయ కళాతోరణంను ఏర్పాటు చేశారు. అయితే, తెలంగాణ రాజముద్రలో ప్రభుత్వం మార్పులు తెస్తున్న విషయం తెలిసిందే. రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించేలా రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా, రాజముద్రలో రాచరికానికి ఆనవాళ్లుగా ఉన్నదని కాకతీయ కళాతోరణం తీసేస్తామని చెప్పిన సీఎం.. పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ఆవిర్భావ వేడుకల్లో మాత్రం కాకతీయ కళాతోరణం స్వాగత తోరణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ అధికారిక చిహ్నం మార్పులపై ఇటీవల ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాచరికం ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం ఉండబోతోందని వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలని.. ఇక్కడ రాచరిక ఆనవాళ్లకు చోటు లేదన్నారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కానీ పరేడ్ గ్రౌండ్‌లో మాత్రం ఆవిర్భావ వేడుకలకు కాకతీయ కళాతోరణం స్వాగత తోరణంగా ముస్తాబు చేశారు.