రాజకీయాల నుంచి తప్పుకోవడంపై కేఏ పాల్ క్లారిటీ
ప్రస్తుతం తెలంగాణలో నాయకులకు పర్సనల్ ఎజెండా తప్ప ప్రజల ఎజెండా ఎవరికీ లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం తెలంగాణలో నాయకులకు పర్సనల్ ఎజెండా తప్ప ప్రజల ఎజెండా ఎవరికీ లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాను పదే పదే ఢిల్లీకి రావడం వెనుక వ్యక్తిగత కారణం ఏమి లేదని కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని చట్టప్రకారం బయటకు తీయడానికే తాను ఢిల్లీకి వస్తున్నానన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డితో తనకు ఒక్క డిబేట్ ఏర్పాటు చేస్తే అసలు వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతానన్నారు.
ప్రజలు తమ పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణకు తాను ముఖ్యమంత్రిగా ఏపీకి బీసీ మహిళను సీఎంగా చేస్తానన్నారు. వరుస ఓటములతో కేఏ పాల్ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ తాను రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను చూసి జగన్ వాతలు పెట్టుకుంటున్నారని తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచితే ఏపీలో జిల్లాలు పెంచారని ధ్వజమెత్తారు.