డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్ రావు లేఖ
టెట్ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టెట్ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని, కానీ టెట్ పరీక్ష నిర్వహించకపోవడంతో దాదాపు 7 లక్షల మంది డీఎడ్, బీఎడ్ విద్యార్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. గత డిసెంబర్ నెలలో డీఎడ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా 50వేల పైచిలుకు మంది ఉంటారని పేర్కొన్నారు.
టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదని తెలిపారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించి, డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని ఆశతో లక్షల మంది ఎదురుచూస్తున్నారని, డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు, టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని కోరారు.