ఆర్ఎఫ్ సీఎల్ వ్యవహారంలో జర్నలిస్టుల పాత్ర..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: కార్మిక క్షేత్రంలో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచిన వ్యవహారంలో కలం యోధుల పాత్ర కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
దిశ ప్రతినిధి, కరీంనగర్: కార్మిక క్షేత్రంలో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచిన వ్యవహారంలో కలం యోధుల పాత్ర కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. శాశ్వత ఉద్యోగాలని నమ్మించి మోసం చేసిన దళారులతో ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా మధ్యవర్తిత్వం చేశారని తెలుస్తోంది. ఈ తంతంగంలో ఓ జర్నలిస్టు పేరును బాధితులు ఊటంకిస్తూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు రాసిచ్చిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆయా రాజకీయ పార్టీల చుట్టూ తిరిగిన ఈ తంతులో రిపోర్టర్ ప్రమేయం వెలుగులోకి రావడంతో పారిశ్రామిక ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే...?
రామగుండంలో పునరుద్ధరణకు నోచుకున్న ఎరువుల కర్మాగారంలో లోడింగ్ అన్ లోడింగ్ కోసం కాంట్రాక్ట్ పద్దతిలో రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఫైవ్ స్టార్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో ఈ సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు రంగంలోకి దిగారు. సుమారు 790 మంది నిరుద్యోగుల వద్ద రూ.7 నుండి 15 లక్షల వరకూ వసూలు చేసిన దళారులు 40 నుండి 45 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైవ్ స్టార్ కంపెనీ ఒప్పందం గడువు ముగియడం దాని స్థానంలో చౌదరి అనే కంపెనీ ఎంటర్ కావడంతో బాధితులు తాము మోసపోయాని అప్పుడు తెలుసుకున్నారు. మొదట కాంట్రాక్టర్ ద్వారా రిక్రూట్ అయిన వీరిని చౌదరి కంపెనీ తొలగించడంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ముంజ హరీష్ అనే బాధితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఇష్యూ కాస్తా సీరియస్‌గా మారింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేస్తానని తన కార్యాలయంలో స్పెషల్ డెస్క్ ఓపెన్ చేశారు. ఇందులో భాగంగా బాధితులు ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో వివరాలు తెలుసుకున్న చందర్‌కు కొంతమంది బాధితులు ఓ వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రం నెట్టింట వైరల్ కావడంతో ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్ల చుట్టే తిరిగిన ఈ అంశం జర్నలిస్టులకూ అంటుకున్నట్టయింది.
2.43 కోట్లు ఇచ్చాం...
ఆగస్టు 27న బాధితులు రాసిచ్చిన లేఖలో ఓ కార్మిక సంఘం నేత, మరో జర్నలిస్టు ఆధ్వర్యంలో రూ. 2.43 కోట్లు ముట్టజెప్పామని బాధితులు రాసిచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. వీరి ఆద్వర్యంలో మోహన్ గౌడ్, గుండు రాజులకు ఇచ్చామని, తమను పనుల నుండి తొలగించిన కారణంగా అట్టి డబ్బులు ఇప్పించాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో కూడా కీలక బాధ్యతలు వహిస్తున్న సదరు జర్నలిస్టు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రా ఏది ఏమైనా ఇంతకాలం పొలిటికల్ లీడర్ల వరకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు జర్నలిస్టులకు కూడా అంటుకోవడం చర్చనీయాంశంగా మారింది. సదరు జర్నలిస్టు ప్రముఖ దిన పత్రికలో గోదావరిఖని కేంద్రంగా పనిచేస్తున్నట్టుగా బాధితులు ఎమ్మెల్యేతో చెప్పినట్టుగా సమాచారం. బాధితులు రాసిచ్చిన వినతి పత్రం నెట్టింట వైరల్‌గా మారింది.