జేఈఈ మెయిన్స్- 2024‌లో తెలుగు విద్యార్థుల ప్రభంజనం

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు.

Update: 2024-02-13 16:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. దేశ వ్యాప్తంగా మొత్తం 24 మందికి విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వీరిలో 10 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్కోర్ చేయడం విశేషం. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించినట్లు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వెల్లడించింది.

100 పర్సంటైల్ అయినా విద్యార్థుల్లో తెలంగాణ నుంచి రిషీ శేఖర్ శుక్లా, రోషన్ సాయి పబ్బ, ముత్తవరపు అనూప్, హందేకర్ దివిత్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయాసాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేశ్‌రెడ్డి వంద పర్సంటైల్ సాధించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలకు https://jeemain.nta.ac.in లింక్‌ను క్లిక్​ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్స్‌కి సంబంధించిన కీ సోమవారం విడుదల కాగా, తాజాగా ఎన్‌టీఏ ఫలితాలను వెల్లడించింది.

ఈ ఏడాది జనవరి 27 నుంచి 31 వరకు అలాగే ఫిబ్రవరి 1న జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షను నిర్వహించింది. మన దేశంతో పాటు మనమా, దోహా, దుబాయ్ వంటి బయటి దేశాలలోని ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్ ( అబుజా), కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్ మరియు వాషింగ్టన్ డీసీ వంటి 21 నగరాల్లో పరీక్షను నిర్వహించారు. మొట్టమొదటి సారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 12,21,624 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 11,70,480 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో పరీక్షను నిర్వహించారు. ఇక జేఈఈ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.


Similar News